Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయకపోగా జీవో నెంబర్ 60 ప్రకారం జూన్ నుంచి పెంచి అమలు చేయాల్సిన వేతనాలు కూడా ఇవ్వడం లేదని, మున్సిపల్, పారిశుధ్య కార్మికులపట్ల సర్కార్ వివక్ష చూపుతోందని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వెంకటరాజం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం. చంద్రశేఖర్ అన్నారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సోమవారం రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ఎదుట మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ... హుజూరాబాద్, వరంగల్ నగరపాలక సంస్థల్లో పెంచిన వేతనాలు అమలు చేసి రాష్ట్రమంతా అమలు చేయకపోవడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. వెంటనే జూన్ నుంచి ఇప్పటి వరకు జీవో 60 ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించడంతోపాటు, ఇక నుంచి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, పండగ సెలవులు ఇవ్వాలని, రెండు జతల బట్టలు, చెప్పులు, సబ్బులు, కొబ్బరి నూనె, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్, రేడియం, ఎర్ర చొక్కాలు ఇవ్వాలని కోరారు. వారాంతపు సెలవు అమలు చేయాలని, ప్రతీ నెల జీతాలు 20 తేదీ వరకు రావడం లేదని, ఫస్టుకే జీతాలు ఇవ్వాలని కోరారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలన్నారు.
కార్మికులపై సూపర్వైజర్ల వేధింపులు ఆపాలని, ఎక్కడైనా సూపర్వైజర్లు వేధించినట్లు తెలిస్తే కఠినంగా శిక్షించాలని, వారిని తొలగించాలని కోరారు. ధర్నావద్దకు మేయర్ గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్రాజు, కమిషనర్ శంకరయ్య, అధికారి సుకృత వచ్చి కార్మికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధర్నాలో యూనియన్ ఉపాధ్యక్షులు పి.పెంటయ్య, మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ నాయకులు నర్సమ్మ, పుష్పమ్మ, నరసింహ, విజరు, జైపాల్, బిక్షపతి, వెంకన్న, సత్యనారాయణ, మద్దిలేటి, నాగ శేషు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.