Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
అక్టోబర్ 25 నాడు లాలాపేట్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసే గ్రౌండ్ మెయింటెనెన్స్ ఔట్సోర్సింగ్ మహిళా కార్మికులపై బండబూ తులతో విరుచుకుపడిన సికింద్రాబాద్ సర్కిల్ -29 డిప్యూటీ కమిషనర్ పల్లె మోహన్‌రెడ్డి.. మరోసారి 'తగ్గేదే లే' అన్నట్లు తన అహంకారాన్ని ప్రదర్శించారు. సరిగ్గా దీపావళికి ముందురోజు సికింద్రాబాద్ స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌గౌడ్ ద్వారా వారిని మరోసారి తన కార్యాలయానికి పిలిపించి 'పేపర్‌కు ఎక్కుతారా? మీరెంత బీ బతుకెంత... మీరు పని దొంగలు... మీ సంగతి చూస్తా... శానిటేషన్ విభాగానికి బదిలీ చేస్తా.. చెట్టుకొకరు పుట్టకొకరు ఐతరు' అంటూ తమను బెదిరించారని ఔట్సోర్సింగ్ మహిళా కార్మికులు మంగళవారం 'నవతెలంగాణ' తో తమ గోడు చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. 'కిందిస్థాయిలో పనిచేసే శ్రామికులన్నా, మహిళా కార్మికులన్నా డీసీ సారుకెందుకంత వివక్ష ?' అని వారు ప్రశ్నిస్తున్నారు. తమకు జీతాలు సరిగ్గా రావని, ఆర్నెల్లకు ఒకసారి వస్తుంటాయని, పైగా మాటలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లు కూడా మహిళలే. తమ బాధలను, సమస్యలను అర్థం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. తాము ఆరు నెలలుగా ఒక్కరోజు కూడా డుమ్మాలు కొట్టకుండా పనిచేస్తున్నా, పనికి రాలేదని డుమ్మా కొట్టారని నమోదు చేశారని వాపోయారు. కనీసం తమకు వారంలో ఒక రోజు సెలవు (వీక్లీ ఆఫ్) కూడా లేదని తెలిపారు. 'మా పనితీరు బాగాలేకుంటే నోటీసులివ్వాలి. ఏం తప్పుచేశామో చెప్పాలి. కానీ గ్రౌండ్లో వాకర్స్ ఎదుట, అధికారుల ఎదుట, ఇష్టమొచ్చినట్లు అహంకారంగా మాట్లా డుతూ బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసం' అని ఔట్సోర్సింగ్ మహిళా కార్మికులు అలివేలు, కె.స్వప్న, సునీత, స్వప్న, లత, అనిత, వారితోపాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దీపక్ రాజ్, కష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. డీసీ తమను హెచ్చరిస్తున్నా అక్కడే ఉన్న స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌గౌడ్ కూడా కనీసం నోరు విప్పలేదన్నారు. సోమవారం రోజు మాత్రం 'వారి వేతనాలు ఇవ్వకుంటే లేబర్ కమిషన్‌ను ఆశ్రయిస్తారట' అని స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ డీసీకి చెప్పడంతో తప్పని పరిస్థితిలో డీసీ వేతనాలు ఇచ్చేందుకు ఫైల్‌పై సంతకం చేశారని తెలి పారు. తాము ఎంత కష్టమైనా చేస్తామని, డీసీ వేధింపులు, సూటిపోటి మాట లు, అహంకారపు మాటలు మానుకోవాలని గ్రౌండ్లో పనిచేసే ఔట్సోర్సింగ్ మహిళా వర్కర్స్ కోరుతున్నారు.
మహిళా ఆఫీసర్‌పై కూడా..
సికింద్రాబాద్ సర్కిల్ -29 డీసీ పల్లెమోహన్రెడ్డి కేవలం జయశంకర్ స్టేడియం వర్కర్లపైనే కాదు, సర్కిల్ 29 కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న ఓ ఉన్నతస్థాయి మహిళా ఉద్యోగినిపై కూడా తీవ్రస్థాయిలో విరుచుపడినట్లు ఆరోపణలు న్నాయి. సదరు ఉద్యోగినిని డీసీ తన ఛాంబర్‌కు పిలిపించి ''నీవు ఇక్కడి నుంచి వెళ్లిపో... లాంగ్ లీవ్ పెట్టుకుని వెళ్లిపో'' అంటూ అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేశారని బాధిత మహిళా ఉద్యోగిని ఆవేదన వ్యక్తం చేశారు. డీసీ తీరుమారాలని ఆమె కోరుతున్నారు. లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలోని గ్రౌండ్ మెయింటెనెన్స్ ఔట్సోర్సింగ్ మహిళా కార్మికులు, ఉద్యోగులు, సర్కిల్ -29 పరిధిలోని ఓ మహిళా ఉద్యోగిని డీసీవల్ల ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని, డీసీపై జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నేనేం అనలే మీ ఇష్టమొచ్చింది రాసుకోండి : డీసీ మోహన్‌రెడ్డి
మహిళా ఔట్సోర్సింగ్ కార్మికులను మరోసారి హెచ్చరిం చారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో డీసీని ఫోన్లో సంప్రదించగా ఈ కింది విధంగా స్పందించారు. ''వాళ్లు మా వర్కర్స్... నేను ఏమీ అనలేదు.. వాళ్ల వేతనాలకు సంబంధించిన ఫైల్ క్లియర్ చేశాను. మీ ఇష్టం వచ్చింది రాసుకోండి'' అని ఫోన్ పెట్టేశారు.