Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుకు వేల సంఖ్యలో ఫోన్లు చేసి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నాయకుల కార్యాలయాలు, ఇండ్లను ముట్టడించి తరిమికొడతామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ వైఖరిపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ తమను అనాదిగా, బానిసలుగా చూస్తున్నారని మండిపడ్డారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హుజూరాబాద్ ఎన్నిక సందర్బంగా మాట్లాడిన మాటలను పట్టుకొని ఫోన్లు చేసి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న మనువాద పార్టీ వైఖరి ఏంటో అర్థం అవుతుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు అనేక ఉచిత హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కిన ప్రజాప్రతినిధులకు ఈవిధంగానే ఫోన్లు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారా అని మండిపడ్డారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎలక్షన్కు ముందు పసుపు బోర్డు తీసుకువస్తానని ప్రజలకు మోసపు హామీలు ఇచ్చారన్నారు. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పి మాట తప్పిన మోడీ ప్రభుత్వాన్ని ఏనాడైనా ప్రశ్నించారా విమర్శించారు. ఎమ్మెల్యే బాలరాజు దళితుడు అనే నెపంతోనే ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడం సరికాదని, ఇప్పటికైనా బీజేపీ నాయకులు అలాంటి చర్యలు మానుకోకపోతే ఎమ్మార్పీఎస్ తగిన బుద్ధి చెప్తుందని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాకార్యదర్శి మంచల యాదగిరి, కోర్ కమిటీ సభ్యులు పసులాది యాదగిరి, నాంపల్లి, గంగారాం అంజయ్య, మల్లేష్, వరిగడ్డి చందు, ఎల్.నాగరాజు, కార్తీక్, దశరథ్ పాల్గొన్నారు.