Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా పూర్తిగా తగ్గని దష్ట్యా లక్షణాలు కన్పిస్తే పరీక్షలు నిర్వహించుకోవడం శ్రేయస్కరమని పేర్కొంటున్నారు. కరోనా అని తేలితే అప్రమత్తంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని, కరోనా అనంతరం కొంతమంది పిల్లల్లో మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్(ఎంఐఎస్) ముప్పు ఉంటుందన్నారు. కొన్ని నెలల క్రితం 15 మంది పిల్లలు వరకు ఈ సమస్యతో గాంధీ ఆస్పత్రిలో చేరారని, అందరూ 4-12 ఏండ్లలోపు వారే అని వెల్లడించారు.
ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి దాదాపు 5 మంది పిల్లలు గాంధీలో చేరితే ఇద్దరికీ ఇటువంటి ప్రమాదం సోకిందని వైద్య నిపుణులు తెలిపారు. వీరిలో చాలామందికి కరోనా సోకినట్లు వారి తల్లిదండ్రులకే తెలియకపోవడం చూసి వైద్యులే విస్మయం వ్యక్తం చేశారు. కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకపోవడం, మరికొందరిలో సాధారణ జలుబు, దగ్గు ఉన్నా 2-3 రోజుల్లో తగ్గిపోవడంతో తల్లిదండ్రులు తొలుత పెద్దగా పట్టించుకోలేదు. అనంతరం 2-3 నెలల తర్వాత పిల్లల్లో కొత్త ఇబ్బందులు తలెత్తాయి. తీవ్రమైన జ్వరం, విరేచనాలు, కడుపులో నొప్పి, కాళ్లలో నీళ్లు చేరటం, చేతుల నుంచి పొట్టులా రాలటం, నాలుక గులాబి రంగులోకి మారటం లాంటి లక్షణాలతో గాంధీలో చేరారు. వీరందరికి కరోనా అనంతరం ఎంఐఎస్ సోకినట్లు తేలింది. తమ పిల్లలకు కరోనా సోకినట్లు తమకు తెలియదని తల్లిదండ్రులు వాపోయారు. జలుబు,దగ్గు,జ్వరం సాధారణమే అనుకోవద్దని,పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నగరంలోని ప్రధాన ఆసుపత్రి లైన గాంధీ ఉస్మానియా, నిమ్స్, నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఎంఐఎస్ లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఉష్ణోగ్రతలో మార్పులు
పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. చలికాలంలో పెద్దలు సైతం వైరల్ జ్వరాల బారిన పడుతుంటారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చాలామంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి వైరల్ జ్వరాలు 3-5 రోజుల్లో తగ్గుతాయి. కరోనా కాలంలో ఇలాంటి లక్షణాలను పిల్లలే కాదు పెద్దలు సైతం నిర్లక్ష్యం చేసేందుకు వీల్లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు తదితర రోగాలుంటే అప్రమత్తంగా ఉండాలని సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ శివరాజ్ సూచించారు. గతంలో ఓ వ్యక్తికి కరోనా వచ్చి తగ్గింది. ఆయన అప్పటికే రెండు డోసుల టీకాలు తీసుకున్నాడు. ఇటీవల జ్వరం, జలుబు,దగ్గు లక్షణాలు కన్పించాయి. అప్పటికే ఆయనకు బీపీ, షుగర్ వ్యాధులున్నాయి. సాధారణమే కదా అని కరోనా పరీక్షలు చేయించుకోలేదు. అయిదు రోజులకు ఆయాసం పెరిగి శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఐసీయూలో ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించారు. నిమిషానికి 6 లీటర్ల ఆక్సిజన్ అందించగా కొన్ని రోజులకు కోలుకున్నాడు.