Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వ సంస్థలతో న్యాయసేవాధికార సంస్థ సమన్వయంతో పనిచేయడం ద్వారా, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పేదలకు చేరేలా చొరవ చూపించాలని, దీంతో పేదరిక నిర్మూలనకు మార్గం సుగమం అవుతుందని హైకోర్టు జడ్జి డాక్టర్ జస్టిస్ సుమలత అన్నారు. శనివారం ఉదయం సికింద్రాబాద్‌లోని ఎస్వీఐటీ కాలేజీ ఆడిటోరియంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పేదల అభ్యున్నతి పేదరిక నిర్మూలన సంక్షేమ పథకాల శిబిరంలో న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ సి.సుమలత మాట్లాడారు. సంకల్పబలంతో సాధించలేనిది ఏదీ లేదన్నారు. సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి న్యాయసేవాధికార సంస్థ అండగా నిలుస్తుందన్నారు. ఉచిత న్యాయ సేవలపై ప్రజలు అవగాహన కలిగి ఉండి న్యాయసేవాధికార సంస్థ సహకారంతో ముందడుగు వేయాలని సూచించారు. వివిధ హోదాలలో న్యాయ సేవాధికార సంస్థకు సూచనలు, సలహాలతో సంస్థను నడిపించిన న్యాయ మూర్తి జస్టిస్ సుమలతను సభలో ఘనంగా సన్మానించారు. పేదరిక నిర్మూలన కోసం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థలు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వినూత్న కార్యక్రమాలతో పాటు న్యాయసేవా శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయసేవలతో పాటు సంక్షేమ పథకాల ప్రయోజనాలు మార్గాన్ని చేరువ చేయడం అభినందనీయమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు.
ప్రజలు సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని కోరారు. హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... న్యాయ సేవాధికార సంస్థ అన్ని ప్రభుత్వ శాఖలు ఈరోజు ఒక్క తాటిపైకి వచ్చి తమ సేవలను విస్తృతపరిచాయని, భవిష్యత్తులో తమ సేవలను సంక్షేమ పథకాల అమలును తీరును ఈ పేదరిక నిర్మూలన శిబిరం తప్పకుండా మెరుగుపరచగలదని అన్నారు. ఇలాంటి అవకాశాలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. తొలుత సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మెన్, ఇన్చార్జి చీఫ్ జడ్జి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ రాజ్యాంగ ఫలితాలు అందుకునే హక్కు ప్రజలందరికీ సమానంగా ఉందని, పేదరికం కారణంగా ఎవ్వరూ తమ హక్కులను కోల్పోరాదన్నారు. ప్రజల మెరుగైన జీవన ప్రమాణాల కోసం, పేదరిక నిర్మూలన కోసం న్యాయసేవాధికార సంస్థ విశేష కృషి చేస్తుందని వివరించారు. మెట్రోపాలిటన్ న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మెన్, మెట్రోపాలిటన్ సెషన్స్ ఇన్చార్జి జడ్జి సురేష్, సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.మురళీమోహన్, సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగం నారాయణ, మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక, మెట్రో పాలిటన్ క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాల్, సిటీ సివిల్ కోర్ట్ అదనపు ప్రధానమూర్తులు శ్రీనాథ్ రెడ్డి, ప్రతిమ, పట్టాభి రామారావు, జీవన్ కుమార్, లక్ష్మి శారద, రవీంద్రశర్మ, కళ్యాణ్ చక్రవర్తి, సరిత, సునీత, రవీందర్‌రెడ్డి, రోజారమణి, శారద, భానుమతి, శ్రీవాణి, కవిత, కుష్బు, మెట్రోపాలిటన్ కోర్టు అదనపు న్యాయమూర్తులు లలిత, శివజ్యోతి, సత్యేంద్ర తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు సాయం అందజేత
కులాంతర వివాహాలు చేసుకున్న 40 జంటలకు షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక్కొక్కజంటకు రూ.1.50లక్షల నగదు పంపిణీతోపాటు అభినందన పూర్వక సర్టిఫికెట్‌ను న్యాయమూర్తి అందజేశారు. సిటీ సివిల్ కోర్ట్ న్యాయసేవాధికార సంస్థ చొరవతో అవయవాలు కోల్పోయిన పలువురికి మహావీర్ విక్లాంగ్ ట్రస్ట్ కృత్రిమ అవయవాలు అందజేసింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కార్మిక శాఖ ఆధ్వర్యంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు రూ.6.5లక్షల చొప్పున నష్ట పరిహారం, మెటర్నిటీ రిలీఫ్ కింద రూ.30 వేల ఆర్థిక సహాయం అందజేశారు. వివాహ సంక్షేమ నిధి వంటి పథకాల కింద కార్మిక శాఖ సాయం చేసింది. వీటితోపాటు పేదరిక నిర్మూలనకు సంబంధించిన సంక్షేమ పథకాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది.