Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై తెలంగాణ ఉద్యమ తరహాలో రాష్ట్రం, దేశవ్యాప్తంగా ఉదతంగా ఉద్యమిస్తామని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు, రైతు నేత పోలాడి రామారావు హెచ్చరించారు. ఆదివారం హిమాయత్‌నగర్ లోని సమాఖ్య రాష్ట్ర కార్యాలయంలో రైతు, ప్రజా సంఘాల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. బడా కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల బకాయిలను రద్దు చేసి, వారికి అనేక రాయితీలు కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం అన్న దాతలు పండించిన పంటలపై ఆంక్షలు విధించడమేమిటని ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక సాగు చట్టాలతో కార్పొరేట్ లకు అనుకూలంగా అన్నదాతలకు నష్టం చేసే విధంగా ఉన్న కార్పొరేట్ లకు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ప్రయివేట్ పరం చేసే విధానాలను మానుకుని, వెంటనే సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సూచించకుండా, నిర్ధిష్ట వ్యవసాయ ముందుచూపు, కార్యాచరణ ప్రణాళిక లేకుండా అకస్మాత్తుగా రైతులు వరి వేయవద్దని ప్రభుత్వం ప్రకటించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటలను కొనుగోలు చేసి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు ఆ బాధ్యతల నుంచి తప్పుకునే దుష్ట యత్నాలు సాగిస్తున్నాయని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా వారం రోజుల్లోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించడంలో భాగంగా ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా రైతు, ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో నిరాహార దీక్షలు, కలెక్టరేట్ల దిగ్బంధనం చేస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో ఓసీ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు గంగవరపు రామకష్ణ ప్రసాద్, వల్లూరి పవన్ కుమార్, దుబ్బా శ్రీనివాస్, కామిడి సతీష్ రెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు బోయినపల్లి పాపారావు, లెంకల శ్రీనివాస్ రెడ్డి, కొలగూరి రాజేశ్వర్ రావు, నల్ల రాజిరెడ్డి, సత్యమోహనశర్మ, మాడుగుల పాపిరెడ్డి, చాడ రవీందర్ రెడ్డి, హంసారెడ్డి, వెంకటరెడ్డి గోపాల్ రెడ్డి, వడ్డే చిరంజీవి, చకిలం రాజేశ్వర్ రావు, చందుపట్ల రాజిరెడ్డి, భీంరెడ్డి, వెంకట్ రెడ్డి, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.