Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దఊరే బ్రహ్మయ్య తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బీసీ నాయకుల ఆధ్వర్యంలో నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1,95 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, రిటైర్డ్ అవ్వడంతో ఖాళీల సంఖ్య ఇంకా పెరిగిందన్నారు. వాటిని భర్తీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పొట్టగొడుతున్నదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తగిన సిబ్బంది లేక ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉద్యోగాల భర్తీ చేయకుంటే సమర్థవంతంగా ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిఏటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ నీల వెంకటేష్, చెరుకు ఉమేష్ గౌడ్, కుంచాల బ్రహ్మయ్య, శివ వంజరి, చంద్రమౌళి లింగరాజ్, సిద్ధ అరవింద్ కురుమ, రమేష్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.