Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను భారత కరెన్సీ నోటుపై ముద్రించాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఫొటో సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం హైదర్‌గూడలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఈ నెల 26న యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ప్రారంభమై ఏప్రిల్ 14 వరకు నిర్వహించే 'జ్ఞాన యుద్ధ యాత్ర' కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కృషితో 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంకును స్థాపించడం జరిగిందని గుర్తు చేశారు. అలాంటి మహనీయుడి ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించేందుకు కేంద్రం కృషి చేయాలని కోరారు. ఈ అంశంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. దీనిపై పార్లమెంటులో ప్రస్తావించి, చర్చించేందుకు చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరశురామ్, అధికార ప్రతినిధి మబ్బు పరశురామ్, నాయకులు బొల్లి స్వామి, జి.కృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.