Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ-ముషీరాబాద్
బహుజనులు, ముస్లింలు రాజకీయ బానిసత్వం వీడాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమ న్యాయ సామాజిక వేదిక ఆధ్వర్యంలో ముస్లిం సమాజం రాజ్యాధికారం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని సనావుల్లాఖాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్యాయ సామాజిక వేదిక ప్రధాన సలహాదారులు రాందాస్ మాట్లాడుతూ తెలంగాణలో బహుజనులు, ముస్లింలు రాజకీయ బానిసత్వం నుంచి వీడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. సమన్యాయ సామాజిక వేదిక చైర్మెన్ పీజీఆర్ నారగోని మాట్లాడుతూ తెలంగాణలో ముస్లింలు 14శాతం ఉన్నారని, బహుజన రాజ్యాధికార ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించాలని పిలుపునిచ్చారు. అగ్రకుల ఆధిపత్యాన్ని అంతం చేయడానికి వచ్చే 2023 ఎన్నికల్లో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. వేదిక కన్వీనర్ సీహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ ముస్లిం సమాజంలో విద్యాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటదాసు, బి.మహేష్ బాబు, డాక్టర్ రియాజ్ మునీరుద్దీన్ మొజాయిద్,రజీ హైదర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.