Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ ఉద్యమ కారిణి సంధ్యపై తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈమేరకు ఆదివారం విద్యానగర్లోని చండ్రపుల్లారెడ్డి భవన్, హిందీమహా విద్యాలయం చౌరస్తాలో పీఓడబ్ల్యూ, ఐఎఫ్టీయూ, ఏఐకే ఎమ్ఎస్, పీడీఎస్యూ అరుణోదయ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళా ఉద్యమ నాయకురాలు సంధ్యపై అంబర్పేట పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి మావోయిస్టు పార్టీ సంబంధాలు న్నాయని చిత్రీకరిస్తున్నారు అని అన్నారు. మహిళా హక్కులు, సమస్యల పరిష్కారం కోసం దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న ఆమెపై తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ప్రజా ఉద్యమాలను నిర్బంధించాలనీ కేసీఆర్ ప్రభుత్వం పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 40 ఏండ్లుగా ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్న రామకృష్ణారెడ్డిపై ఎలాంటి ఆరోపణలు, కంప్లైంట్లు లేవని గుర్తుచేశారు. నవ్య ప్రింటింగ్ ప్రెస్లో ఈనెల 12న వంద మంది పోలీసులు అక్రమంగా చొరబడి కంప్యూటర్ హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకోవడం, ప్రెస్లో పనిచేస్తున్న 50 మంది కార్మికుల సెల్ ఫోన్లను తీసుకోవడమే కాకుండా భయబ్రాంతులకు గురిచేయటం అప్రజాస్వామికమైనదిగా తెలిపారు. మావోయిస్టు నేత రామకృష్ణ (ఆర్కే) అనారోగ్యంతో మరణించిన సందర్భంలో అమరుల బంధుమిత్రుల సంఘం పేరుతో ఆయన జీవిత సహచరి పుస్తకాన్ని ప్రింటింగ్ చేయిస్తున్నదని అందులో రాయబడిన వ్యాసాలు గతంలో దినపత్రికలలో అచ్చువేయబడినవని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక, అభ్యంతరకర విషయాలు పుస్తకంలో ఉంటే విచారణ చేయవచ్చని అంతేగాని పోలీసులు ఈ విధంగా చట్టాలను ఉల్లంఘించి తప్పుడు పద్ధతులకు పాల్పడటం అన్యాయమని అన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, అనురాధ, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి కోటంరాజు రణధీర్, అంబిక, సమత రోష్ని, పీఓడబ్ల్యూ బండారి విజయ, సరళ, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పరుశురాం, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, ఉపాధ్యక్షులు సీతారామయ్య, కె.విశ్వనాథ్, కోశాధికారి ఎండీ రాసుద్దిన్, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు మధు, ప్రవీణ్, పీడీఎస్యూ నాయకులు రియాజ్, నాగరాజు, సుధాకర్, రేణుక, భారతి తదితరులు పాల్గొన్నారు.