Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఓయూలో సెక్యూరిటీ కార్మికులను అకారణంగా తొలగించిన ఓయూ వీసీ కార్మిక వ్యతిరేకి అని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ ఆరోపించారు. ఏఐటీయూసీ, ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం హిమాయత్‌నగర్ 'వై' జంక్షన్ వద్ద ఓయూలో తొలగించిన సెక్యూరిటీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏండ్లుగా అతి తక్కువ జీతంతో పని చేస్తూ నిరంతరం యూనివర్సిటీని పరిరక్షిస్తూ, వర్సిటీ అభివృద్ధి కోసం పాటు పడిన తెలంగాణ కార్మికులను తొలగించి, ఈ ప్రాంతంతో ఎలాంటి సంబంధం లేని నాన్ లోకల్ వారికి ఓయూలో ఉద్యోగాలు కల్పించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. అకారణంగా ముందస్తు సమాచారం లేకుండా కార్మికుల కుటుంబాలను రోడ్డును పడేయడం అమానవీయ చర్య అని అన్నారు. కార్మికుల పట్ల వీసీ మోసపూరిత వైఖరిని ప్రతి ఒక్క ప్రజాస్వామికవాది ఎండగట్టి కార్మికులకు, తెలంగాణ సమాజానికి అండగా నిలవాలని కోరారు. వారం రోజుల్లో కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, లేకపోతే ఓయూలో వీసీని అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎం.నరసింహ, ఏఐఎస్ఎఫ్ హైద్రాబాద్ జిల్లా అధ్యక్షులు గోలి హరికృష్ణ, సెక్యూరిటీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.