Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ చట్టాన్ని కాపాడాల్సిన రాష్ట్ర పోలీసులు చేయని నేరాలకు కేవలం అనుమానంతో దళిత, గిరిజనులపై అనూహ్యమైన క్రూరత్వం ప్రదర్శిస్తున్నారని తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఏసురత్నం, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.అంజయ్య నాయక్ ఆరోపించారు. దళిత, గిరిజనులపై దాడులు, హింస, అక్రమ కేసులు, లాకప్ డెత్‌లను నిరసిస్తూ సోమవారం లిబర్టీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అనునిత్యం దళితులు, గిరిజనులపై దాడులు, హత్యలు, వెలివేతలు, అణిచివేతలకు గురికావడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనే పోలీసులే ఇలాంటి ఘటనలకు పాల్పడటం దారుణమన్నారు. పోలీసుల తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడం తప్ప కఠిన చర్యలు ఏమీ తీసుకోవడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో కుల ఆధారిత హింస, దోపిడీ, హత్యలు, దౌర్జన్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇందు కోసమేనా అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్దంగా పోలీసులు వ్యవహరిస్తూ చిన్న చిన్న నేరాలకు అనుమానం పేరుతో దళిత గిరిజనుల్ని పోలీస్ స్టేషన్ లకు తీసుకువచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించి, లాకప్ డెత్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే ప్రభుత్వం స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమితి నేతలు భానుచందర్, జె.కుమార్, డి.రాములు, చెన్నయ్య, గిరిజన సమాఖ్య నేతలు ఎన్.రూప్ సింగ్, రాజునాయక్, నగేష్, శ్రీనునాయక్, జె.వెంకటేష్, చంద్రునాయక్ పాల్గొన్నారు.