Authorization
Fri April 04, 2025 10:17:17 am
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం కాలక్షేపం చేయడం తగదని డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కృష్ణ నాయక్ అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జంగంమ్మెట్ ఫలకనుమా రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద బర్రెకి వినతిపత్రాన్ని ఇచ్చి వినూత్న నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బర్రెను నమ్ముకున్న పాలిస్తుందేమో కానీ అదే తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్ముకున్న నిరుద్యోగులు మాత్రం అధోగతి పాలే అవుతున్నారన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక నోటిఫికేషన్ విడుదల చేస్తానని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటివరకు కాలయాపన చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు సమస్యపై బీజేపీ, టీఆర్ఎస్ దొంగ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే విషయం గమనించి ప్రజలను డైవర్ట్ చేయడానికి గేమ్స్ ప్లే చేస్తున్నారని దుయ్యబట్టారు. వెంటనే రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న 1,91,126 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలు, ఆందోళన చేయక తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా నాయకులు రామ్ కుమార్ నాయక్, శ్రీను, రమేష్, మురారి, రాము, ఈశ్వర్, ప్రశాంత్, సంజరు తదితరులు పాల్గొన్నారు.