Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
తెలంగాణ సారస్వత పరిషత్ మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన కవిత, కథ రచన పోటీల విజేతలకు శుక్రవారం బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిర్లో జరిగిన ఉత్సవంలో తెలంగాణ 25 జిల్లాల నుంచి వచ్చిన 38 మంది విద్యార్థిని, విద్యార్థులకు నగదు బహుమతితో పాటు బహుమతి పత్రం, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. సాహిత్యరంగంలో 50 ఏళ్లకు పైబడిన వారే తప్ప యువత కనిపించడం లేదనే వాదానికి కాలం చెల్లిపోయిందని చెప్పడానికి ఈనాడు తెలంగాణ వ్యాప్తంగా పాఠశాల స్థాయి నుంచే వందలాదిగా కవులు, రచయితలు తయారవుతారని ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు అన్నారు. ఇది ఆశావహమైన పరిణామమని అన్నారు. సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి సభకు అధ్యక్షత వహించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మక రచనలు చేసే నైపుణ్యాన్ని కలిగించేందుకు పరిషత్తు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ముందు ముందు విద్యార్థుల కోసం సాహిత్యం పై అధ్యయన శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి ప్రసంగిస్తూ 78 ఏళ్ల చరిత్ర కలిగిన గొప్ప సంస్థ తెలంగాణ సారస్వత పరిషత్ వేదికపై బహుమతిని అందుకోవడం అదష్టం అని తెలిపారు. పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జై చెన్నయ్య మాట్లాడుతూ కరోనా కాలంలో కూడా పోటీకి విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందని. ఇరవై ఐదు జిల్లాల నుంచి విద్యార్థులు కవితలు, కథలు రాశి పంపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల చెలిమి వ్యవస్థాపకులు ఎం వేదకుమార్. పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు. ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఏ సిల్మా నాయక్. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.