Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు, ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు
ఓసీ సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతపై ఆడుతున్న చెలగాటం, డ్రామాలు ఆపి రైతు సంక్షేమానికి పాటు పడాలని ఓసీ సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షులు, రైతు ఉద్యమ నేత పోలాడి రామారావు హెచ్చరించారు. రైతు, ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్ బాగ్ లోని సమాఖ్య రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామారావు మాట్లాడుతూ ఒక పక్క కేంద్రం బాయిల్డ్ బియ్యం కొనమని మొండి వైఖరి అవలంభించడం, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం వరి పంట సాగు చేయవద్దని ప్రకటించడంతో వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు అయోమయంలో కొట్టుమిట్టాడుతూ ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వరి ధాన్యపు కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలు ఆపకపోతే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించారు. నెత్తురు చమటగా మార్చుతూ ఆరుగాలం కష్టిస్తున్న అన్నదాత నోట్లో మట్టి కొట్టే చర్యలు విడనాడాలని ప్రభుత్వాలను కోరారు. బడా కార్పొరేట్ పారిశ్రామిక వ్యక్తులకు లక్షల కోట్లు బకాయిలు రద్దు చేసి, వారికి అనేక రాయితీలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుండటం పట్ల ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. దేశవ్యాప్త రైతుల ఆందోళనలతో రైతు వ్యతిరేక సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోక తప్పలేదన్నారు. కేంద్ర నిర్ణయం రైతులకు పాక్షిక ఉపశమనమేనని అన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై దష్టి సారించని రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరి వేయవద్దని ప్రకటించడం సహేతుకం కాదని, రైతులు అభద్రత భావానికి గురవుతున్నారన్నారు. రౖతులు పండించిన ప్రతి గింజాను కొనుగోలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారం రోజుల్లోగా అన్నదాతకు అనుకూలంగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ సమాఖ్య ఆధ్వర్యంలో 'క్రాప్ హాలిడే' ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఓసీ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్ రెడ్డి, రైతు సంఘాల రాష్ట్ర ప్రతినిధులు దుబ్బా శ్రీనివాస్, రావుల నర్సింహారెడ్డి, బోయినపల్లి పాపారావు, రామకష్ణ ప్రసాద్, నల్లా రాజిరెడ్డి, చింతిరెడ్డి రమణారెడ్డి, సారాబుడ్ల రాజిరెడ్డి, బోల్ల లవయ్య, తాళ్లపల్లి కొమురయ్య, తోట శ్రీనివాస్, తాళ్లపల్లి సంపత్ గౌడ్, మూల పుల్లారెడ్డి, ఎర్రబెల్లి భూంరావు, బండా లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సమ్మిరెడ్డి, సదా శివారెడ్డి, అనంతరెడ్డి, పోల్సాని పీతాంబర్ రావు, గోపు గోపాల్ రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, కనకం శంకర్, రమేష్, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మోరె సమ్మయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.