Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ భగ్గుమంటున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలతో దిగుబడి తగ్గడంతో కూరగాయల రేట్లు ఎక్కసారిగా పెరుగుతున్నాయి. ఇలా అయితే నిత్యావసర వస్తువులు, కూరగాయలు 'కొనేదెట్ల.. తినేదెట్ల..? అని పేద, మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు సరుకు తక్కువగా రావడం, డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు, అధికారులు పేర్కొంటున్నారు.
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుదల ప్రభావం రవాణాపై పడటం, అల్పపీడనాలు, వాయుగుండాలు కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటంతో పూత, పిందె రాలి పంట దిగుబడి తగ్గి ధరలు పెరిగేందుకు కారణమైంది. టమాటా, క్యారెట్, వంకాయ, దొండ, బెండ, పెద్ద చిక్కుళ్లు, క్యాప్సికమ్, బీన్స్ ధరలు బాగా పెరిగాయి. స్థానికంగా పండేవి కూడా దిగుబడి ఆలస్యమవడంతో అవసరాలకు సరిపడా కూరగాయలు అందుబాటులో లేకపోవడం ధరలు పెరగడానికి మరో కారణమంటున్నారు. రైతు బజారుకు వెళ్లినవారు చిన్న మధ్యతరగతి వ్యక్తులే వారు వారానికి సరిపోయేవాన్ని ఒక్కసారి కొనుక్కుంటారు. అలాంటిది బోర్డుపై ధరలు చూసి పది రకాలు కొనేవారు రెండు, ముడు రకాలు కూడా కొనడం లేదు. దేని ధర తక్కువుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు ఎక్కువ మంది ఆకుకూర పప్పులో కలిపేస్తున్నారు. ఇంకొందరు అర కిలో, పావు కిలో వంతున కొంటున్నారు.
ఘాటుగా క్యాప్సికమ్ రేటు
క్యాప్సికమ్ ఇంతకుముందు రూ.35 ఉండగా ప్రస్తుతం రూ.68కు చేరుకుంది. బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఇక్కడకు తీసుకొస్తారు. గతంలో నాలుగైదు క్వింటాళ్లు కష్ణనగర్ రైతుబజార్‌కు వచ్చేవి. వర్షాల కారణంగా ఇప్పుడు రెండు క్వింటాళ్లకు మించి రావడం లేదంటున్నారు. కేజీ క్యారెట్ రూ.50 పైగానే పలుకుతుంది. గతంలో ఏడెనిమిది క్వింటాళ్ల వరకు వచ్చే సరకు ప్రస్తుతం సగమే వస్తుంది. కేజీ పెద్దచిక్కుళ్లు రూ.64 ఉండగా, బీన్స్ రూ.52, చివరకు గోరు చిక్కుళ్లు కూడా రూ.46కు చేరుకుంది. దొండ, బెండకాయల ధరలు నెల క్రితం కేజీ దొండ రూ.15 ఉండగా ప్రస్తుతం రూ.37కు చేరుకుంది. మార్కెట్, సూపర్ బజార్లు, ప్రయివేటు రైతుబజార్లలో మిరింత అధికంగా ఉన్నాయి. కేజీకి రూ.5 నుంచి రూ.10 వరకు ఎక్కువగా వసూలు చేస్తున్నారు.
సెంచరీ కొట్టిన టమాటా
ప్రతి ఇంట్లో ఏ కూర వండినా టమాటా ఉండాల్సిందే. అక్టోబర్ మొదటి వారంలో రైతుబజార్లలో కేజీ టమాటా రూ.35 ఉండగా ప్రస్తుతం రూ.56కు చేరుకుంది. సెప్టెంబర్ మొదటి వారంలో రైతుబజార్లలో రూ.16 మాత్రమే. చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి ఇక్కడకు దిగుమతి అవుతుంటాయి. కష్ణనగర్ రైతుబజార్‌కు గతంలో రోజుకు 25 క్వింటాళ్లు వరకు వచ్చేవి. ఇప్పుడు 15 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. వర్షాలకు పంట దెబ్బ తినడంతో పాటు హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాలకు సరకు ఎక్కువగా వెళ్లిపోతుండడంతో ఇక్కడకు వచ్చే సరకు తగ్గింది.