Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
'థియేటర్ల (సింగిల్ స్క్రీన్)లో ద్విచక్ర వాహనాలకు రూ.20, నాలుగు చక్రాల వాహనాలకు రూ.30ల చొప్పున పార్కింగ్ రుసుము వసూలు చేయొచ్చు. మాల్స్, మల్టీప్లెక్స్, ఇతర వాణిజ్య సముదాయాల్లో పాత నిబంధనలే వర్తిస్తాయి' అని జులై 20న పురపాలక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కానీ ఉత్తర్వుల సాకుతో జీహెచ్ఎంసీ పరిధిలోని మాల్స్, మల్టిఫెక్స్లు పార్కింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. దీంతోపాటు థియేటర్లలోనూ నిర్దేశించిన వాటికంటే అధిక ఫీజు వసూలు చేస్తున్నారని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మెనేజ్మెంట్ (ఈవీడీఎం), సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ (సీఈసీ) ట్విట్టర్ ఖాతాకు ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలూ లేకపోలేదు. పైగా ట్విట్టర్లో అడ్వర్టైజ్మెంట్, హోర్డింగ్‌ల విషయంలో చురుకుగా వ్యవహరి స్తున్న జీహెచ్ఎంసీ ఈవీడీఎం, సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ (సీఈసీ) పార్కింగ్ ఫీజు ఫిర్యాదులపై ఎందుకు స్పందించడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు. ప్రభుత్వం జీఓ జారీచేసిన తర్వాత మాల్స్, మల్టిఫ్లెక్స్‌లో అధికారులు తనిఖీలు చేసిన దాఖల్లేవని విమర్శిస్తున్నారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రమే..
గ్రేటర్లో పార్కింగ్ మాఫియాను అడ్డుకునేందకు రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్ల క్రితం ఉచిత పార్కింగ్‌కు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. థియేటర్లు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదని 20 మార్చి 2018న పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత పార్కింగ్ నిబంధనలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాల్స్, మల్టీప్లెక్సుల్లో మొదటి 30 నిమిషాలు కొనుగోళ్లతో సంబంధం లేకుండా ఉచిత పార్కింగ్‌కు అవకాశముంటుంది. 30 నిమిషాల నుంచి గంట వరకు ఎంతో కొంత కొనుగోలు చేసినా (పార్కింగ్ ఫీజు కంటే తక్కువ బిల్లు చూపినా) వసూలు చేయవద్దు. గంటపైన వాహనం నిలిపితే... పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ కొనుగోలు చేసిన బిల్లు/సినిమా టికెట్ చూపిస్తే పార్కింగ్ ఫ్రీ అని స్పష్టం చేశారు. అయితే పార్కింగ్ ఫీజు విధానం అవుతుంది. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు వాహనాలను కాపాడడం, క్రమపద్ధతి పార్కింగ్ చేసేలా నియమించే సిబ్బందికి వేతనాల చెల్లింపు ఆర్థికంగా భారమవుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ థియేటర్లలో పార్కింగ్ ఫీజుకు అవకాశం కల్పించింది. మాల్స్, మల్టీప్లెక్స్‌లు, ఇతర వాణిజ్య సముదాయాల్లో మాత్రం పాత విధానమే కొనసాగు తుందని పేర్కొంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ వాహనదారులను దోచుకుంటున్నాయి.
ఉత్తర్వులు బహిర్గతం..
గ్రేటర్లో మాల్స్, మల్టిఫ్లెక్స్‌లో పార్కింగ్ ఫీజు వసూలు చేయడంతో నగవాసులు ఫిర్యాదులు చేశారు. ఈనేపథ్యంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజుకు అవకాశం కల్పిస్తూ జారీ చేసిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు మరోసారి ఉత్తర్వుల కాపీని శనివారం బహిర్గతం చేశారు. ఎక్కడైనా మాల్స్, మల్టిఫ్లెక్స్‌లో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.