Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
రైతు ఉద్యమం దేశ ప్రజలకు స్ఫూర్తిని నింపిందనీ, ఈ ఉద్యమంతో యువత ఉద్యోగ అవకాశాల కోసం పోరాటానికి శ్రీకారం చుట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ అన్నారు. ఏఐవైఎఫ్ ఉప్పల్ మండల రెండో మహాసభ మల్లాపూర్, గోకుల్‌నగర్‌లో నిర్వహించగా ఏఐవైఎఫ్ నాయకులు రాజ్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని నెలలుగా రైతులు చేసిన స్ఫూర్తిదాయక పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందనీ, రైతు న్యాయమైన డిమాండ్లకు మెడలు వంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ కోరుతూ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్టు చేసిన ప్రకటన స్వాగతించదగ్గ పరిణామం అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆమో దయోగ్యమైన చట్టాలను రూపొందించాలే తప్ప, కార్పొరేట్ అను కూల చట్టాలను రూపొందిస్తే ప్రజా పోరాటాలు, తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలే అన్నారు. ఏడేండ్ల పాలనలో కేసీఆర్ ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాడో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో వేలాది ఖాళీలు ఉన్నాయనీ, ఈ ఖాళీలను తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీ బోర్డు ద్వారా జాబ్ మేళాలు నిర్వహించాలనీ, నైపుణ్య అభివృద్ధి శిక్షణా తరగతులు నిర్వహించి యువతకు ఉపాధి కల్పించవచ్చని ఉద్ఘాటించారు. ఈ మహాసభలో జిల్లా అధ్యక్షుడు సత్యప్రసాద్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు సుగుణ, పీఈటీ జిల్లా అధ్యక్షులు నరేందర్, ఏఐవైఎఫ్ నాయకులు నవీన్, రాజేష్, శిరీషా, లక్ష్మీ, రాజ్‌కమల్, అమర్, రాజు నాయక్‌లతో పాటు 40మంది పాల్గొన్నారు.
ఏఐవైఎఫ్ ఉప్పల్ మండల నూతన కమిటీ ఎన్నిక
ఏఐవైఎఫ్ ఉప్పల్ మండల నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా వి.రాజ్ కుమార్, కార్యదర్శిగా కె.నవీన్, ఉపాధ్యక్షుడిగా రవికుమార్, పి.జగన్ మోహన్‌రావు, కె.శివ, శ్రీవాణి, సహాయ కార్యదర్శిగా బి. హరికృష్ణ, లక్ష్మీ, కవితా కుమారి, పవన్ కోశాధికారిగా కె.బ్రహ్మయ్యతో పాటు 32 మందిని కౌన్సిల్ సభ్యుల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.