Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రాష్ట్రంలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందిల బదిలీలను తక్షణమే చేపట్టాలని టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, స్టాంప్స్, రిజిస్ట్రే షన్ శాఖ సర్వీస్ అసోసియేషన్ చైర్మెన్ డాక్టర్ ఎస్.ఎం. హుస్సేనీ (ముజీబ్) కోరారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్టుమెంట్ కమిషనర్, ఐజీ శేషాద్రికి ఆయన వినతి పత్రం అందజేశారు. అనంతరం ముజీబ్ మాట్లాడు తూ... ఆఫీస్ సబార్డినేట్ నుంచి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ వరకు ఉద్యోగుల బదిలీలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐజీకి విజ్ఞప్తి చేశారు. డిపార్టుమెంట్‌లోని చాలామంది ఉద్యోగులు 7నుంచి పదేండ్లకు పైగా ఒకేచోట పనిచేస్తు న్నారని, ఒకే స్టేషన్లో చాలా ఏండ్లుగా ఉండడం వల్ల ఉద్యో గులతో పాటు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఈ అంశా లను దృష్టిలో పెట్టుకొని బదిలీలను చేపట్టాలని కోరారు.
విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి
కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారి (డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్) అధికారితో విజిలెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలని, తద్వారా డిపార్టుమెంట్‌లోని బెదిరింపులను అరికట్టడానికి వీలు కలుగుతుందని ముజీబ్ అన్నారు. అలాగే ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్న కార్యాలయాలను గుర్తించి అక్కడ సిబ్బందిని పెంచడంతో పాటు తక్కువ పని కార్యాలయాలకు ఆ పనిని విభజించాలని పేర్కొన్నారు. దీనివల్ల సిబ్బంది, సబ్ రిజిస్ట్రార్‌పై పనిభారం తగ్గుతుందని ఆయన ఆ లేఖలో వివరించారు. కాగా 25/08/2020వ తేదీన జారీ చేసిన సర్క్యులర్ నెం. జీ2/ 257/ఈ/ 2019 పై స్పష్టత లేదని.. దీనివల్ల సబ్ రిజిస్ట్రార్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.
అర్హులకు లైసెన్స్‌లు ఇవ్వాలి
డాక్యుమెంట్ రైటర్ లైసెన్స్‌లను రద్దు చేయడానికి ముందుగానే ఇప్పటికే డాక్యుమెంట్ రైటర్‌గా ఉన్నవారికి, డిపార్టుమెంట్లో న్యాయవాదులు లేదా రిటైర్డ్ ఉద్యోగులు లేదా పట్టభద్రులుగా ఉన్నవారికి డాక్యుమెంట్ ప్రిపరేషన్ కోసం లైసెన్స్‌లు ఇవ్వాలని ఆయన సూచించారు. ఉద్యోగుల ప్రమోషన్లో భాగంగా ఏదైనా రిజర్వ్ కేటగిరి పోస్ట్‌లో ఉన్నట్టయితే, ఆ అభ్యర్థి అందుబాటులో లేకపోతే తక్షణమే పదోన్నతులు చేపట్టేలా అటువంటి అర్హతగల అభ్యర్థి ఎవరైనా పోస్ట్‌ను క్లెయిమ్ చేసినప్పుడు షరతులకు లోబడి పదోన్నతులను ఇవ్వాలని ఆ పోస్టులను ఖాళీగా ఉంచరాదని ముజీబ్ సదరు లేఖలో కోరారు.