Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 16 వేల మంది విద్యా వాలంటీర్లను వెంటనే రెన్యూవల్ చేయాలని, గత 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో పలు జిల్లాల నుంచి హాజరైన వందలాది మంది విద్యా వాలంటీర్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకు విద్యా వాలంటీర్లను రెన్యూవల్ చేయకపోవడం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల అందరి ఉద్యోగుల జీతాలు పెంచారని, అదేవిధంగా విద్యా వాలంటీర్ల జీతాలను రూ.12 వేల నుంచి 24వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ ఆధారంగా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వెబ్ నోటిఫికేషన్ ద్వారా కలెక్టర్ ఆధ్వర్యంలో పాఠశాల పేరెంట్స్ కమిటీ సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన కోసం రాష్ట్రంలో 16 వేల మంది విద్యా వాలంటీర్లను సెలెక్ట్ చేసి విధుల్లోకి తీసుకున్నారని గుర్తు చేశారు. గత 10 నెలలుగా జీతాలు లేక పుట్టెడు కష్టాలతో కుటుంబాలను పోషించుకోలేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ఈ విషయంలో సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి, విద్యా వాలంటీర్ల కష్టాలు తీర్చాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంటి ముదిరాజ్, పలు జిల్లాల నుంచి విద్యా వాలంటీర్లు పాల్గొన్నారు.