Authorization
Thu April 03, 2025 04:30:54 am
- కోఠి యూనివర్సిటీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ విజ్యుల్లత
- తెలుగు స్వాతంత్య్ర సమర యోధులు, భారత రాజ్యాంగ విశిష్టతపై ఛాయా
చిత్ర ప్రదర్శన ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో, కోఠిలోని యూనివర్సిటీ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజ్యుల్లత బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామనీ, దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనేక పోరాటాలు జరిపారనీ, యువత స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎందరో స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారనీ, 'ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో' భాగంగా ఆ మహనీయుల త్యాగాలు, వారి వీరోచిత పోరాటాల గురించి నేటి తరానికి తెలియ జేయాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందనీ, వారిలో స్ఫూర్తిని రగిల్చే విధంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు ఉంటుందనీ, విద్యార్థులు ఈ ప్రదర్శనలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి, సమైక్యత, సమగ్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను జరుపుకుంటున్న ఈ తరుణం లో ఇలాంటి మంచి ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపినందుకు ఆర్ఓబీ అధికారులను ఆమె అభినందించారు. ఆర్ఓబీ అసిస్టెంట్ డైరెక్టర్ ఐ.హరిబాబు మాట్లాడుతూ పింగళి వెంకయ్య, కుమురంభీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, సురవరం ప్రతాపరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి ఎందరో స్వాతంత్య్ర సమరయోధల జీవిత విశేషాలకు సంబంధించిన 40కి పైగా ఛాయాచిత్రాలను ఈ ప్రదర్శనలో ఉంచామని తెలిపారు. ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం, దాని విశిష్టత గురించి తెలియచేసే 15 ఫోటో ప్యానెల్స్‌ను కూడా ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ఛాయాచిత్ర ప్రదర్శన నవంబరు 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా విద్యార్ధులకు అర్ఓబీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమర యోధులపై పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా ఎక్కువ సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా విద్యార్థులు ఆసక్తిగా పెద్ద సంఖ్యలో తిలకించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ భరతలక్ష్మి, ఎగ్జిబిషన్ అధికారి అర్థ శ్రీనివాస్ పటేల్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.