Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
ఆశావర్కర్లకు రూ.10 వేలు ఫిక్స్డ్ వేతనంగా నిర్ణయించి అమలు చేయాలని, వారి జాబ్ చార్టును వెంటనే ప్రకటించాలని సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేశ్, శ్రామిక మహిళా సెంట్రల్ సిటీ కమిటీ కన్వీనర్ ఆర్.వాణి డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ డీఎంహెచ్వో ఆఫీసు ఎదుట తెలంగాణ ఆశా వర్కర్స్్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో సుమారు 2వేల మంది ఆశా వర్కర్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో, ఆరోగ్య సేవలు అందించడంలో ఆశాలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గత సంవత్సరం కొవిడ్ వచ్చినప్పుడు ఆరోగ్య సిబ్బందితోపాటు ఆశావర్కర్లు సైతం తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆశాలతో రోజుకు 8 గంటలకు పైగా పనిచేయిస్తున్నారని, పారితోషికం మాత్రం పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ సర్వేలో ఇంటింటికీ తిరుగుతుండటంతో ఆశావర్కర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని, మోకాళ్ల నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. నిత్యావసర ధరలు, పెంట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగాయని, ఈ నేపథ్యంలో ఆశాలకు ఇచ్చే అతితక్కువ పారితోషికం ఏం సరిపోతుందని ప్రశ్నించారు. ఫిక్స్డ్ వేతనం రూ.10 వేలతోపాటు గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రకటించిన 30 శాతం పీఆర్సీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్లపై పనిభారం తగ్గించాలని, ఆదివారం సెలవులు ఇవ్వాలని కోరారు. టీఏ, డీఏలు ఇవ్వాలని, జాబ్ చార్టును ప్రకటించాలని, వారాంతపు, పండుగ సెలవులు ఇవ్వాలని కోరారు. కొవిడ్ వ్యాక్సినేషన్ సర్వేకు ప్రత్యేక పారితోషికం ఇవ్వాలని, పారితోషికం లేని పనులను ఆశాలకు చెప్పొద్దని డిమాండ్ చేశారు. ఆశాలకు సెల్ ఫోన్లు, రీచార్జ్ డబ్బులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షురాలు యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.