Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఈనెల 27, 28 తేదీల్లో సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ 22వ మహాసభలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నామని జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాస్ తెలిపారు. గోల్కొండ క్రాస్‌రోడ్డులోని సీపీఐ(ఎం) కార్యాలయంలో బుధవారం కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌రావు, ఎం.దశరథ్‌లతో కలిసి మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మహాసభలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించనున్నారని, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు హాజరుకానున్నారని తెలిపారు. 2017లో జరిగిన మహాసభల నుంచి ఇప్పటి వరకు జరిగిన పోరాటాలు, ఆందోళనలు, ఉద్యమాలను సమీక్షించుకోవడంతోపాటు భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకోవడం, కొత్త కమిటీ ఎన్నిక ఉంటాయన్నారు. నాలుగేండ్ల కాలంలో అనేక ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చామని, ఈఎస్ఐ కుంభకోణం, హైదరాబాద్ మెట్రోరైలు చార్జీల పెంపు, ఎంఎంటీఎస్ రైళ్ల ప్రారంభం, రెండో దశ పనులు ప్రారంభించాలని, ప్రధాన ఆస్పత్రుల్లో జరుగుతున్న అక్రమాలు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో యూజర్ చార్జీలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేశారు. కార్మికశాఖలో సెస్ నిధుల పక్కదారి, జీహెచ్ఎంసీలో సెంట్రల్ ఫైనాన్స్ నిధులు పక్కదారి, వెల్నెస్ సెంటర్లో మందుల కొనుగోళ్లలో అక్రమాల గురించి పోరాటాలు నిర్వహించామన్నారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆందోళనలు శాంతియుతంగా చేయకుండా ఆస్తుల విధ్వంసం చేయడం, అరాచకంగా ప్రవర్తించడం బీజేపీకే చెల్లుతుందని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా అనవసరమైన హంగామాలు సృష్టిస్తున్న బీజేపీ చర్యలను తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.