Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆటో సంఘాల జేఏసీ డిమాండ్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
మెహిదీపట్నం ఆర్టీఏ సీపీ వెంకటేశ్వరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జీఎసీ ఆధ్వర్యంలో గురువారం హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆటో సంఘాల జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం మాట్లాడుతూ గత రెండేండ్ల నుంచి మెహిదీపట్నం ఆర్టీఏ సీపీ వెంకటేశ్వరరావు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తూ చట్టానికి వ్యతిరేకంగా ఆర్టీఏ ఆఫీస్‌కు వచ్చే వారి వద్ద నుంచి పనిని బట్టి రేట్లు నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎంవీఐగా పని చేసినప్పుడు అనేకమైన అవినీతి, ఆరోపణలు అతనిపై ఉన్నాయని గుర్తు చేశారు. వెంకటేశ్వరరావు అవినీతి ఆరోపణలపై సంబంధిత అధికారులు రవాణా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్, రవాణా శాఖ మంత్రి, సీఎం కేసీఆర్‌లకు ఆటో సంఘాల జేఏసీ తరపున పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో జేఏసీ నాయకులు ఆర్ మల్లేష్, సీహెచ్ జంగయ్య, ఎ. సత్తిరెడ్డి, భిక్షపతి, ఎస్.అశోక్, శ్యామ్, ఎండీ ఫరూక్, ఎండీ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.