Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, భ్రూణహత్యలు నివారించి ఆడపిల్లలను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశంలో గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ లింగనిర్ధారణ ప్రక్రియ నిషేద చట్టం-1994పై అధికారులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఆస్పత్రుల్లో గర్భిణులకు పుట్టబోయేది ఆడబిడ్డా, మగబిడ్దా అని తెలుసుకోవడానికి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే అది చట్టరీత్యా నేరమని గుర్తించాలన్నారు. ఈ విషయంలో ఆస్పత్రి యాజమాన్యాలు పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అందరికీ తెలిసేలా కరపత్రాలు ముద్రించి శిక్షణనివ్వడంతో పాటు జిల్లా పోలీసు అధికారుల సహకారంతో రహస్య ఆపరేషన్లు, తనిఖీలు నిర్వహించాలన్నారు. షీ టీమ్స్‌ను కూడా ఇందులో చేర్చుకొని వారి సేవలను సైతం వినియోగించుకోవాలని పేర్కొన్నారు. పుట్టబోయే ఆడపిల్లలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చట్టం ప్రవేశపెట్టిందని వారికి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి అన్ని ప్రయివేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూచన బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్ రావు, రాచకొండ క్రైమ్ బ్రాంచి డీసీపీ యాదగిరి, లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా సెక్రెటరీ శ్రీదేవి, డిప్యూటీ జిల్లా ఎక్సటెన్షన్ మీడియా ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి , సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.