Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రాష్ట్ర జనాభాలో అత్యంత చైతన్యవంతమైన, శక్తివంతమైన యువత క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, యువజన, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం హైదరాబాద్ విక్టరీ ప్లే, ఇండోర్ స్టేడియంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ 2021 పోటీలను ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడల్లో ప్రతిభను సాధించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగా ప్రతి జిల్లాలో అత్యాధునిక గ్రౌండ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు, భవిష్యత్‌లో పతకాల ఆశలను పెంపొందించడానికి క్రీడా ఔత్సాహికులకు శాస్త్రీయ శిక్షణను అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. యువత అభివృద్ధికి క్రీడలు, ఆటలు ఎంతో తోడ్పడుతాయన్నారు. అత్యుత్తమ క్రీడాకారులుగా ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. అనంతరం కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్న విజేతలకు ట్రోఫీలు, పతకాలను అందజేశారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు(ఢిల్లీ) వేణుగోపాలచారి, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అధ్యక్షులు మొహమ్మద్ అంజాద్, ఉపాధ్యక్షులు శివ గణేష్, ప్రధాన కార్యదర్శి షేక్ ఖాలిద్, సహాయకార్యదర్శులు జీషాన్, మొహమ్మద్ ఫరూకుద్దీన్ పాల్గొన్నారు.