Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరూర్ నగర్ బీసీ గురుకుల పాఠశాలలో వసతులపై పట్టింపులేని అధికారులు
బోరు వాటర్ తాగి 16 మంది
విద్యార్థులకు అస్వస్థత
నవతెలంగాణ-సరూర్నగర్
ఎంతో బ్రహ్మాండంగా గురుకులాల ద్వారా విద్యను అందిస్తున్నామనే ప్రజా ప్రతినిధులు, అధికారుల మాటలు ఆచరణలో అమలైతలేవు. గురుకులాల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని సరూర్ నగర్ బీసీ గురుకుల పాఠశాల పరిస్థితి. ఈ గురుకుల పాఠశాల భవనంలో కనీస సౌకర్యాలు లేవు. ప్లే గ్రౌండ్, విద్యార్థులకు సరిపడ గదులు లేవు. డైనింగ్ హాల్ ప్రత్యేకంగా లేదు. ఒకే హాల్లో భోజనాలు చేయడం, అక్కడే పడుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నారు. కొన్నిరోజులుగా తాగడానికి మంచి నీళ్లు లేకపోవడంతో బోర్ వాటర్ తాగిన అస్వస్థకు గురయ్యారు. బోర్వాటర్లేక వారం రోజులుగా స్టూడెంట్స్ కొందరు స్నానం చేయలేకపోయారు. ఇక ఆహారం విషయానికి వస్తే వంటల్లో, వడ్డింపుల్లో నాణ్యత పాటించడం లేదు. కుళ్లిన కూరగాయతో, రాళ్లు కూడా వేరు చేయని బియ్యంతో వంట చేస్తున్నారు. మురిగిపోయిన పండ్లను పిల్లలకు ఇస్తున్న పరిస్థితి ఉంది. టీచర్లు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పుడొస్తరో ఎప్పుడు వెళ్తరో అంతా ఇష్టారాజ్యంగా మారింది. క్లాసులు సరిగ్గా చెప్పడం లేదు. రెగ్యులర్ టీచర్లు 12 మాత్రమే ఉన్నారు. ఇట్లయితే తమ పిల్లలు ఎట్ల చదువుకుంటారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 960 మంది విద్యార్థులకు 12మంది టీచర్లు మాత్రమే ఉంటే నాణ్యమైన విద్య ఏ విధంగా అందుతుందో ప్రభుత్వమే చెప్పాలని కోరుతున్నారు. పాఠశాలలో పరిశుభ్రత లేకపోవడంతో పిల్లలు అనారోగ్యాల పాలవుతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. శనివారం గురుకుల పాఠశాలను సందర్శించి వసతులు పరిశీలించారు.