Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సిటీ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. శనివారం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఓఎస్ గార్డెన్లో సీటీ పోలీసులు టీఎంఐ గ్రూప్ సంయుక్తంగా 'మెగా జాబ్‌మేళా'ను నిర్వహించారు. జాబ్‌మేళాను ప్రారంభించిన సీపీ అంజనీకుమార్ మాట్లాడారు. యువకులు తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా ఉపాధి అవకాశాలతోపాటు ఉద్యోగాలను కల్పించేందుకు పోలీస్ శాఖ కృషిచేస్తోందన్నారు. మూడేండ్లలో 21వేల మంది నిరుద్యోగ యువతీయువకులకు జాబ్‌మేళా ద్వారా ప్రముఖ కంపెనీలల్లో ఉద్యోగావకాశాలు కల్పించామని తెలిపారు. శనివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో దాదాపు 20 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. ఆయా కంపెనీల్లో 2000 ఉద్యోగాలకు ఆయా కంపెనీ ప్రతినిధులు ఇంటర్య్వూలు నిర్వహించి 1000 ఉద్యోగాలను కల్పించారని తెలిపారు. హైదరాబాద్‌లో 4000 మంది నిరుద్యోగులు జాబ్‌మేళాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మెన్నెన్, డీసీపీ గజారావు భూపాల్, అడిషనల్ డీసీపీలు సయ్యద్ రఫీక్, బి.రాములు నాయక్, ఏసీపీ ఎంఏ ముజీబ్తోపాటు టీఎంఐ గ్రూప్ జనరల్ మేనేజర్ అర్చనా సమతాని తదితరులు పాల్గొన్నారు.