Authorization
Sat March 29, 2025 08:54:30 pm
సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ 22వ మహాసభ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో శనివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమైంది. సభా ప్రారంభానికి ముందుగా ఎర్రజెండాను ఆవిష్కరించారు. అమరవీరులకు రెడ్సెల్యూట్ చేశారు. ఎర్రజెండా రెపరెపలు, కళాకారులు పాటలతో సభా ప్రాంగణమంతా సందడి నెలకొన్నది. కళాకారుల ఎర్రజెండా పాటలు, పోరాట గీతాలు అలరించాయి. శనివారం ప్రారంభమైన మహాసభ ఆదివారం కూడా కొనసాగనుంది గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాల రూపకల్పనకు ఈ మహాసభలో రూపొందించుకుంటారు. శనివారం పలు తీర్మానాలను సభ ఆమోదించింది.
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో ఇప్పటికే పూర్తయిన ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ 22వ మహాసభలో శనివారం తీర్మానించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు రోజులపాటు జరగనున్న మహాసభను శనివారం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. అంతకుముందు పార్టీ జెండాను నగర మాజీ కార్యదర్శి పీఎస్ఎన్ మూర్తి ఆవిష్కరించారు. మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా నాలుగు తీర్మానాలను ఏకగ్రీవంగా సభ ఆమోదించింది. రాష్ట్రప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సిన బకాయిలు, గ్రాంట్స్ వెంటనే చెల్లించాలని, ప్రత్యేక నిధులు కేటాయించి నగర సమగ్రాభివృద్ధికి కృషిచేయాలని తీర్మానంలో పేర్కొంది. దీంతోపాటు ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని మరో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కనీసవేతనాల జీఓలను సవరించడంతోపాటు కనీసవేతనం రూ.21వేలుగా నిర్ణయించి అమలు చేయాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇదిలా ఉండగా ప్రతినిధుల సభలో నాలుగు ఏండ్లుగా సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ నిర్వహించిన ఉద్యమాలు, పోరాటాలు, కార్యక్రమాలకు సంబంధించిన నివేదికను నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. ఆదివారం కొత్త కమిటీ ఎన్నికతో మహాసభ ముగియనుంది.