Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సకల జనుల సమ్మె.... వంటా వార్పు... ధూంధాం... రిలే నిరాహార దీక్ష ఇలా టీఆర్ఎస్ ఏ పిలుపునిచ్చినా ఆయన ముందున్నారు. 100 రోజుల రిలేనిరాహారదీక్షలో పాల్గొన్నారు. చిన్నా పెద్దా నాయకులతో కలిసి పనిచేశారు. అంతా తానై ముందుండి చౌరస్తాలు, రోడ్లు, గల్లీలు అనే తేడా లేకుండా పార్టీ పటిష్టతకు ఎంతో కృషి చేశారు. అయినా చివరకు గుర్తింపు కరువైంది. నాడు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తనను నేడు పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ ఉప్పల్ డివిజన్లో సీనియర్ నాయకులు, రామంతాపూర్ నివాసి, బైగల్లి జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో తాను టీఆర్ఎస్ ఎదుగుదలకు ఎంతో కృషి చేశానన్నారు. వందరోజుల రిలే నిరాహార దీక్షలతోపాటు రామంతాపూర్, ఉప్పల్, హబ్సీ గూడ తదితర ప్రాంతాల్లో ఐదు ధూంధాం కార్యక్ర మాలను నిర్వహించాన న్నారు. టీఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన తనను దళితుడనే కారణంతో దూరం చేస్తున్నారని, కొందరు తనకు గుర్తింపు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్కు, ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని మాత్రం పార్టీలో అందలమెక్కిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముందు నుంచి ఉద్యమంలో పనిచేసిన తన లాంటి వారిని విస్మరింస్తున్నారని వాపోయారు. టీఆర్ఎస్లో ఉద్యమ కారులకంటే, ఉత్తవాళ్లకే గుర్తింపు, గౌరవం లభిస్తున్నా యని తెలిపారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పార్టీ కోసం కష్టపడిన సీనియర్ కార్యకర్తలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తనలాంటి వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరారు.