Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగాన్ని సవరించి వర్గీకరణ చేపట్టాలని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం హబ్సిగూడలోని సుప్రభాత్ హోటల్లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్ సమావేశం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గువ్వల బాలరాజు, ఆరూరి రమేష్, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై బీజేపీ దాటవేసే ధోరణి ప్రదర్శిస్తోందని, దళిత సంఘాలు గళం విప్పి సంఘటితం కావాలన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి, రాజకీయ పబ్బం గడుపుకునే బీజేపీకి వర్గీకరణపై చిత్తశుద్ధి లేదన్నారు. పార్లమెంట్ సమావేశాలలోనే బిల్లును పెట్టి, రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. లేకపోతే వర్గీకరణ వేడిని చవిచూడాల్సి వస్తుందన్నారు. మాదిగలు, మాదిగ ఉపకులాలను తప్పుదోవ పట్టిస్తూ, మోసం చేయవద్ద న్నారు. నాయకత్వం కోసం జాతికి అన్యాయం చేయవద్ద న్నారు. వర్గీకరణ చట్టబద్ధమైంది, న్యాయమైందన్నారు. మాదిగల ఆత్మగౌరవం కోసం సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. జాతి లక్ష్యం కోసం పోరాటం చేస్తామని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. న్యాయమైన డిమాండ్ టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేర్కొన్నారు. జాతి ప్రయోజనాల కోసం అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. పదవుల కోసం కాకుండా జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తామన్నారు. ప్రజా ప్రతినిధులు పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు. డిసెంబర్ 13న చలో ఢిల్లీ నిర్వహించి, ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీస్ సత్తా చాటుతామన్నారు. మాదిగల ఆత్మగౌర వం కోసం అందరూ 13న ఢిల్లీకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.