Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాజ్యాంగాన్ని బోధించాల్సిన ప్రిన్సిపాల్ రాజ్యాంగంపై జరిగే సదస్సును అడ్డుకోవడం ప్రిన్సిపాల్ అవివేకానికి నిదర్శనం అని, ఆమెపై చర్యలు తీసుకొవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ స్టాలిన్ అన్నారు. బుధవారం యూనివర్సిటీ లా కాలేజ్‌లో రాజ్యాంగంపై చర్చించేందుకు ప్రిన్సిపాల్ భయపడుతున్నారని, ఆ భయంతోనే సెమినార్ అడ్డుకున్నారని, దురుసుగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ పై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని లా కాలేజీలో ఓయూ కమిటీ ఆధ్వర్యంలో 'భారత రాజ్యాంగం- ఎదుర్కొంటున్న సవాళ్లు'' అనే అంశం పై సెమినార్ నిర్వహిస్తున్న సందర్భంలో యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి ఆ సెమినార్ ను అడ్డుకోవడం అప్రజాస్వామికమని తెలిపారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ కు ఓయు ఏఐఎస్ఎఫ్ నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ప్రిన్సిపాల్ తీరును నిరసిస్తూ నాయకులు కళాశాల ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్తే, చుట్టు ఉన్న గేట్లకు ప్రిన్సిపాల్ ఉద్దేశపూర్వకంగా తాళాలు వేయించారని ఆరోపించారు. గేట్లు తెరిపించి డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ను ఆహ్వానించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ప్రిన్సిపాల్ ప్రొ. విజయలక్ష్మిని వివరణ కోరగా ఒక్కవిద్యార్ధి సంఘానికి ఇస్తే అన్ని సంఘాల ఇవ్వాల్సి వస్తుందని ,అందులో క్లాస్ లకు ఇబ్బందులు ఎదుర్కొంటారని అనుమతి ఇవ్వలేదని చెప్పారు.అనంతరం గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ అసమానతలు లేని భారత నిర్మాణం జరగాలంటే సంపూర్ణంగా రాజ్యాంగాన్ని అమలు జరిగిన నాడే సాధ్యమవుతుందన్నారు. ప్రపంచీకరణ ఆర్థిక విధానాల కారణంగా రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశ యువత రాజ్యాంగాన్ని అవపోశన చేసుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని ప్రభుత్వాలను కోరారు. ఆర్థిక, రాజకీయ, సామాజికంగా, సాంస్కతికంగా భారతదేశం సమానంగా మనుగడ కొనసాగించాలంటే భారత రాజ్యాంగం సక్రమంగా అమలు చేయాలని సూచించారు. భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, అంబేద్కర్ పూలే మహానీయుల స్ఫూర్తితో సాంకేతిక విప్లవం సాధించాలని వారు అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ఎన్ శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్, ఉస్మానియా యూనివర్సిటీ కార్యదర్శి క్రాంతి రాజు, నాయకులు రెహమాన్, పండారీ, అంబేద్కర్, ఎండీి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.