Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని టీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. డిసెంబర్ 13న ఢిల్లీలో జరిగే 'చలో ఢిల్లీ-మాదిగ, మాదిగ ఉపకులాల లొల్లి కార్యక్రమానికి మాదిగ, మాదిగ ఉపకులాల విద్యార్థులంతా కలిసి పెద్దఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ విద్యార్ది సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరి వెంకట్ పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట పోస్టర్ విడుదల చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం దండోరా ఉద్యమం ప్రారంభమై 27 ఏండ్లు పూర్తయిందని, ఎందరో మాదిగ బిడ్డలు తమ నిండు ప్రాణాలను సైతం త్యాగం చేశారని, కానీ మాదిగల న్యాయమైన డిమాండ్ మాత్రం నెరవేరలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తానని చెప్పి ఏండ్లు గడుస్తున్నా కానీ ఆ సమస్యను పరిష్కరించకుండా మాదిగ, మాదిగ ఉపకులాల విద్యార్థులకు మోసం చేస్తున్నదని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన మాదిగ విద్యార్థులు తమ హక్కుల కోసం మరోసారి ఢిల్లీలో తమ గొంతు వినిపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకోవడానికి మాదిగ, మాదిగ ఉపకులాల విద్యార్థులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఎఫ్ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్షులు వరిగడ్డి చందు, శాగంటి రాజేష్, చింతం తిరుపతి, రాష్ట్ర నాయకులు ఎల్. నాగరాజు, ధర్మరపు శ్రీకాంత్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కానుగంటి సురేష్, విద్యార్ది నాయకులు చరణ్, రాంప్రసాద్, అశోక్,గిరి, ప్రేమ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.