Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుధ్య కార్మికుల సమస్యలు అనేకం ఉన్నాయని, ప్రజా సేవలో కార్మికులు తమ కుటుంబాలను సైతం పక్కనపెట్టి బాధ్యతతో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయడం వల్లనే నిజాంపేట్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కిందని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జి .వెంకటరాజం అన్నారు. కరోనా సైతం లెక్క చేయక పనిచేసిన వారిలో పారిశుధ్య కార్మికులు ముందు వరుసలో నిలిచారని, కానీ ప్రభుత్వం వారి సమస్యలను మాత్రం పట్టించుకోవడంలేదన్నారు. ఈమేరకు గురువారం నిజాంపేట్ వార్డు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్మిక నాయకుడు, యూనియన్ అధ్యక్షుడు జి.వెంకట రాజం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశుధ్య కార్మికులకు మొదటి పీఆర్సీ తీసుకువచ్చి ప్రతి కార్మికుడికి రూ.19'500 వేతనం అమలు పరుస్తామని ఇచ్చిన హామీ ఇంతరవకు నెరవేర్చలేదన్నారు. అతిపెద్ద మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అవతరించిన నిజాంపేట్‌లో కార్మికులకు వేతనాలతోపాటు కనీస సమస్యలు తీర్చడం లేదన్నారు. కార్మికులకు వారాంతపు సెలవు సైతం ఇవ్వకుండా వారితో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. అనారోగ్యాలకు గురైన కార్మికులు ఈఎస్ఐ ఆస్పత్రికి వెళ్తే చికిత్స కూడా అందించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కారిశుధ్య కార్మికుల శ్రమను గుర్తించి వారికి వేతనాల సమస్యలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించే చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే సమస్యలు పరిష్కారమయ్యే వరకు సంఘటితంగా పోరాడేందుకు వెనకాడబోమని తెలిపారు. కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పెంటయ్య, నరసమ్మ, భాగ్యమ్మ, పుష్ప, వెంకటేష్ పాల్గొన్నారు.