Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పురోగతి సాధించి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పురపాలక, నగరపాలక సంస్థలకు చెందిన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మెన్లు, వైస్ చైర్మెన్లు, మున్సిపల్ కమిషనర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇప్పటికే వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని, ప్రజావసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తామని వివరించారు. కొన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైకుంఠధామాలు ఇంకా పూర్తికాలేదని తమ దృష్టికి వచ్చిందని, వీటిని వీలైనంత త్వరలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, వారి అవసరాలు తీర్చేందుకు పని చేస్తోందన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు గుర్తుంచుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాలు, పార్కులు, చెరువులు తదితరాలతో పాటు రూ.110 కోట్లతో బోడుప్పల్, ఫీర్దాజిగూడలో పూర్తయిన పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని దీన్ని దృష్టిలో ఉంచుకొని పది రోజుల్లో పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని తెలిపారు. జిల్లాలోని నిజాంపేట, ఘట్కేసర్ మున్సిపాల్టీలకు స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు రావడం గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో అన్ని మున్సిపాలిటీలు అవార్డులు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి విషయంలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అందరూ సమన్వయంతో కలిసి పని చేసినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని అన్నారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు నరసింహారెడ్డి, జాన్ శాంసన్, ఆర్డీఓ మల్లయ్య పాల్గొన్నారు.