Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డబుల్ ఇండ్లు, రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు నమోదు
విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలి
కరోనాతో తీవ్ర ఇబ్బందుల్లో పేద ప్రజలు : ఐద్వా
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా లాక్డౌన్ అనంతరం పేద ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, మూడేండ్లుగా పింఛన్లు రాక వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని ఐద్వా డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ కారదర్శి కె.నాగలక్ష్మి, ఐద్వా సౌత్ జోన్ కార్యదర్శి పి.శశికళ అడిషనల్ కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో ఇటీవల ఐద్వా నిర్వహించిన సర్వేలో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. కరోనా దెబ్బకు ఉన్న ఉపాధి కోల్పోయి.. అధిక ధరలతో ఇండ్లు గడవక అప్పుల పాలు అయి ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అని అన్నారు. ఇంటి అద్దెలు పెరుగుతుండటంతో పేదలు అద్దెలు కట్టలేక అవస్థలు పడుతున్నారని, అర్హులైన పేదలందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని వారు అదనపు కలెక్టర్‌ను కోరారు.
నగరంలో ప్రయివేటు స్కూళ్లలో ఫీజులు ఇబ్బడిముబ్బడిగా పెంచుతుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రయివేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని వారు కోరారు. రేషన్ కార్డులలో పిల్లల పేర్లను నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని, వెంటనే ఆ ప్రక్రియను ప్రారంభించాలన్నారు.
అలాగే కేరళ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా 14 రకాల నిత్యావసర వస్తువులు రేషన్ షాపుల ద్వారా అందించాలనీ, కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్దఎత్తున్న మహిళలతో ఆందోళనలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు ప్రభుత్వ అధికారులకు తెలిపారు.