Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
చెంగిచెర్ల ఆధునిక కబేళా లీజును టెండర్లు పిలవకుండానే పొడగించడం అక్రమమని, దీనిలో భారీగా అవినీతి జరిగిందని, ఏసీబీతో విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి పి.సత్యంతో కలిసి గోల్కొండ క్రాస్‌రోడ్డులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కబేళా నిర్వహణ లీజు పొందిన సలీం అండ్ కంపెనీ గడువు జులై 2018తో ముగిసిందని, కొత్త లీజు ఒప్పందం కోసం టెండర్లు పిలవకుండానే తాత్కాలికంగా సలీం అండ్ కంపెనీని కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల సహకార ఫెడరేషన్ సంస్థ నిర్ణయించడం అక్రమమని అన్నారు. ఈ అవినీతిపై సీపీఐ(ఎం) ఆందోళనతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు. తాత్కాలిక లీజు అక్రమమని, ప్రభుత్వ ఆదాయానికి నష్టంతోపాటు ఏటా రూ.7 కోట్ల మార్కెటింగ్ ఫీజు కూడా ఎగవేతకు గురైందని నివేదిక పేర్కొందన్నారు. కబేళాను నగరవాసులకు నాణ్యతమైన మాంసాన్ని సరఫరా చేయడానికి ఏర్పాటు చేశారని, కానీ ఇతర దేశాలు, ప్రాంతాలకు ఎగుమతి కేంద్రంగా మారిందని చెప్పారు. బోయిగూడ, అంబర్పేట్, రాంనాస్‌పురా కబేళాలకు ఏడాదికి రూ.9 కోట్ల చొప్పున చెల్లిస్తుంటే 70 ఎకరాల సువిశాల ప్రాంతంలోని చెంగిచెర్ల కబేళాను రూ.1.92 కోట్లకు లీజుకు ఇవ్వడం దారుణమన్నారు. సలీం వక్ఫ్‌బోర్డు చైర్మెన్‌గా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెలిపారు. ప్రజల సొమ్మును అప్పనంగా కట్టబెట్టడంలో పశుసంవర్థక శాఖ మంత్రికి బాధ్యతలేదా? అని ప్రశ్నించారు. తక్షణమే లీజును రద్దుచేసి, గ్లోబల్ టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. కబేళా నిర్వహకునిగా ఉన్న సలీం కంపెనీ యజమానిగా మారిపోయిందని, మాంసం మార్కెట్‌పై గుత్తాధిపత్యం చెలాయిస్తూ స్థానికులకు ఉపాధిలేకుండా చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ... అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కబేళా నుంచి ఆదాయాన్ని రాబట్టుకోకుండా మౌనంగా ఉండడం శోచనీయమన్నారు. మాంసం కట్టింగ్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కో-ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకుంటామంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా ఏకపక్షంగా సలీం అండ్ కంపెనీకి కట్టబెట్టడం సరైంది కాదన్నారు. అధికారులను సైతం లోపలికి రానివ్వకుండా గుట్టుగా దందా చేస్తున్నారని అన్నారు.