Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
జూన్‌లో విడుదల చేసిన జీవో 60 పీఆర్సీ ప్రకారం రూ.22,900 వేతనాలు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని సీఐటీయూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద పెరిగిన పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ జి.రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం పెరుగు తున్న ధరలతో కుటుంబాన్ని పోషించలేక మున్సిపల్ కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వరంగల్ జిల్లాలో జమ్మికుంట మున్సిపాల్టీలో అమలు చేస్తున్నారనీ, అలాగే జీహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజిగిరి మున్సిపాల్టీలో కూడా అమలు చేయాలని కోరారు. కార్మికులు వారంలో ఏదైనా ఒక రోజు, రండు రోజులు డ్యూటీకి రాలేకపోతే చట్ట ప్రకారం ఇవాల్సిన వీక్లీ ఆఫ్ ఇవ్వడం లేదనీ, ఇది చట్ట విరుద్ధం అనీ, మీరు జోక్యం చేసుకుని వారాంతపు సెలవులు చట్ట ప్రకారం అమలు జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నాగరాజు, ఎల్ల య్య, అంజమ్మ, నాగయ్య, కిషోర్, కృష్ణ, మున్సిపల్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.