Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్కూరి ఎల్లయ్య, (నవతెలంగాణ-బోడుప్పల్)
ఉన్నత చదువులు పెద్దగా చదవలేదు.. ఉన్నత కుటుంబంలోనూ పుట్టలేదు.. ఎక్కడున్నా ప్రజా సమస్యలపై గళమెత్తడానికి నిత్యం సిద్ధంగా ఉంటారాయన. ఇసుమంత అహంకారాన్ని దరిచేరనివ్వని ఆ నేత.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడేందుకు తపన పడుతుంటారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 'హస్తం' పార్టీని అన్నివిధాలా అభివృద్ధి పరుస్తూ, కార్యకర్తలు, నాయకులను సమన్వయపరుస్తూ పార్టీ కార్యకలాపాలను విజయవంతం చేస్తున్నారు. స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహిస్తూ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ చూపుతున్నారు. వార్డు మెంబర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, అందరితో కలిసిపోయే ఉదాత్త హృదయశీలి తోటకూర వజ్రేష్ యాదవ్. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రాబోయేరోజుల్లో కీలక నేతగా మారనున్నారని అందరినోటా వినిపిస్తోంది. ఇటీవలే పార్టీ సమన్వయకర్తగా అధిష్టానం గుర్తించగా.. ప్రస్తుత, భవిష్యత్ ప్రణాళికలను 'నవతెలంగాణ'తో పంచుకున్నారు.
నవతెలంగాణ : మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ ఊపు కనిపిస్తున్నట్టుంది..?
వజ్రేష్ యాదవ్ : నిజమే.. మా కార్యకర్తలంతా ఉత్సాహంతో ఉన్నారు. రేవంత్‌రెడ్డి వచ్చాక జరిగిన సభలు, ధర్నాలకు మేడ్చల్ జిల్లా, నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున తరలివెళ్లాం. అన్ని కార్యక్రమాలు విజయవంతంగానే సాగాయి. ఎక్కడా లేనివిధంగా ఈ జిల్లాలో 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, ఐదు మండలాలున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక సైన్యాన్ని ఏర్పర్చుకుంటున్నాం. పేరుపేరునా పిలవకపోయినా మా సందేశాలు చూసి సమావేశాలకు తరలివచ్చేంత చైతన్యవంతమైన క్యాడర్ కాంగ్రెస్ సొంతం.
నవతెలంగాణ : రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసుంటారు కదా..?
వజ్రేష్ యాదవ్ :అవును.. ముందు టీడీపీలో పనిచేశా. 2007లో దేవేందర్‌గౌడ్ నవతెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట నడిచాం. చివరకు ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేయగా, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కింది. దాదాపు 40వేల ఓట్లు వేసి ప్రజలు నన్ను ఆదరించారు. తదనంతరం రేవంత్‌రెడ్డి సమక్షంలో 2017లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని పార్టీ అభివృద్ధి కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నాం. ఎక్కడున్నా నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటున్నాం.
నవతెలంగాణ : ఇటీవల జరిగిన శిక్షణా తరగతుల్లో ఏం చెప్పారు?
వజ్రేష్ యాదవ్ : క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం మా సైన్యం పనిచేస్తోంది. గ్రామం, మండలం, వార్డులవారీగా కమిటీలు వేసుకోవాలని, ప్రతి డివిజన్లో సభ్యత్వ కార్యక్రమం చేపట్టాలని నిర్దేశించారు. ఆ కార్యకలాపాలన్నీ సాగుతున్నాయి.
నవతెలంగాణ : మేడ్చల్ పరిధి రాజకీయాలు ఎలా ఉన్నాయి?
వజ్రేష్ యాదవ్ : గత ఎన్నికల్లో ఇక్కడ మల్లారెడ్డి గెలిచి మంత్రి అయ్యారు. మల్కాజిగిరి ఎంపీగా ఆయన ఐదేండ్లు ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఏ ప్రాజెక్టయినా వచ్చిందా? ఆ పార్లమెంట్లో 36 లక్షల మంది ఓటర్లుంటే ఏం చేశారు? వలసజీవులకు అడ్డాగా ఉన్న ఇక్కడ కనీసం చదువుకుందామంటే సరైన ప్రభుత్వ కాలేజీల్లేవు. ఆయన యూనివర్సిటీలను విస్తరింపజేసుకున్నారు తప్ప పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య అందడం కష్టంగా మారింది. కనీసం స్టేడియం లేదు, ఈ మండలాల్లో ఐదు పదివేల ఎకరాల్లో పండిన ధాన్యాన్ని కూడా కొనలేకపోయారు. స్థానికులు అన్నీ గమనిస్తున్నారు. ఇచ్చిన హామీలను ఇకనైనా నెరవేర్చకపోతే మున్ముందు కాంగ్రెస్‌వైపే ఓటర్లుంటారని నమ్ముతున్నాం.
నవతెలంగాణ : స్థానికంగా ఉన్న సమస్యలేమిటి? వాటిని గుర్తించారా..?
వజ్రేష్ యాదవ్ : బోడుప్పల్లో ఏడాదిక్రితం వచ్చిన వరదల సందర్భంగా నాలాల కబ్జాలు తెరమీదకొచ్చాయి. వంద కోట్లు కేటాయించి ఏదో ప్రాజెక్టు చేపడుతున్నామని హడావుడి చేశారు. ఇప్పటివరకు చేసిందేమీ లేదు. 2014లో కేసీఆర్ ఇక్కడ మీటింగ్ పెట్టి, మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు 20వేల ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కటైనా ఇచ్చారా? పదివేల మంది దరఖాస్తులు చేసుకుంటే కట్టింది 300 ఇండ్లు. నాలుగేండ్లయినా వాటికీ అతీగతీ లేదు. మంత్రి సామ్రాజ్యాలను పెంచుకున్నారు తప్ప పేద బిడ్డలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు, భూములు, దళితులకు ఎన్నెకరాల భూములందాయో అందరికీ తెలుసు. జూనియర్, డిగ్రీ కాలేజీ కూడా మాటలకే పరిమితమయ్యాయి. ప్రతిపక్షంలో ఉండి కూడా బొల్లారం ప్రభుత్వాసుపత్రికి తమవంతుగా సహాయం అందించి, కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు కృషి చేశాం. ఎంపీ రేవంత్‌రెడ్డి నిధుల నుంచి కావాల్సిన సౌకర్యాలను కల్పించారు.
నవతెలంగాణ : మంత్రిపై కబ్జాల ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. వాస్తవమేనా?
వజ్రేష్ యాదవ్ : మంత్రి ఇలాకాలో విద్య, వైద్యమే కాదు.. అనేక సమస్యలున్నాయి. చౌదరిగూడలో ఏడున్నర ఎకరాల ప్రభుత్వ స్థలంలో లే అవుట్ చేసి అమ్ముకునేందుకు యత్నిస్తే కాంగ్రెస్ ఆధ్వర్యంలో అడ్డుకున్నాం. గుండ్లపోచంపల్లిలో ఉన్న భూముల్లోంచి ఆయన కాలేజీకి రోడ్డు వేసుకున్నారు. వీటన్నింటిపై ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నాం.. ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం.. కానీ ప్రభుత్వమే పట్టించుకోనప్పుడు సామాన్యులకు న్యాయం దక్కుతుందా? తన విద్యా వ్యాపారం ఎక్కడ పడిపోతుందోనని మెడికల్, జూనియర్, డిగ్రీ కాలేజీలు రాకుండా మంత్రి కుట్ర పన్నుతున్నాడు.
నవతెలంగాణ : వరుస ఓటములతో మీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి లేదా?
వజ్రేష్ యాదవ్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకే ఎక్కువగా అవకాశాలుంటాయన్నది వాస్తవం. కానీ టీఆర్ఎస్లో ఉన్న ఏ ఒక్క నాయకుడూ సంతృప్తిగా లేడు. స్వతహాగా ప్రజల కోసం నిర్ణయం తీసుకునే పరిస్థితే లేదు. అందువల్ల మేం ఏర్పాటుచేస్తున్న కమిటీలకు ప్రజా సమస్యలపై స్పందించాలని సూచిస్తున్నాం. అధికార పార్టీ అన్యాయాలను అడ్డుకోవాలని, ప్రజలకు అండగా నిలవాలని చెబుతున్నాం. సభ్యత్వ కార్యక్రమం పూర్తయ్యాక కలిసికట్టుగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలుకు పోరాడుతాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం.