Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ సఫాయి మిత్ర చాలెంజ్‌లో అవార్డు పొందిన నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుధ్య కార్మికుల సమస్యలను అధికారులు, ప్రజా ప్రతినిధులు పరిష్కరించడంలేదని సీఐటీయూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షులు జె. వెంకట రాజం అన్నారు. పారిశుధ్య కార్మికుల వేతన సమస్యతో పాటు, వారికి కల్పించే సౌకర్యాలు ప్రతి నెలా అందేవిధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బాచుపల్లిలో వార్డు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత గ్రామపంచాయతీ హయాంలో తమకు వేతనాలు సీనియార్టీ ప్రకారంగా ఇరవై వేలకు పైగా వచ్చేదని, అతిపెద్ద నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన తర్వాత ఉన్న వేతనాలకు రూ.10వేలకు వరకు కుదించి ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి పీఆర్సీ రూ.19,500 చెల్లిస్తామని తెలిపి కార్మికులను మభ్యపెట్టి మళ్లీ మరొక జీవో తీసుకువచ్చి ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదని తెలిపారు. రాత్రింబవళ్లు కష్టపడుతున్న పారిశుధ్య కార్మికులకు నెలసరి నూనె, సబ్బులు, చెప్పులు జతలు, తదితర వస్తువులు ఇచ్చి మూడేండ్లు అవుతోందన్నారు. అనారోగ్యం బారిన పడితే వారి నెలవారి జీతంలో కోతలు విధించి, ఆనిధులు ఈఎస్ఐ సంస్థకు చెల్లించకపోవడంతో ఆస్పత్రి వారు కనీసం పేషెంట్లను చూడకుండా పంపిస్తున్నారన్నారు. కరోనా సమయంలో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ.50 లక్షలు చెల్లించాలని, విధి నిర్వహణలో మరణిస్తే వారికి రూ,25 లక్షలు బీమా, డబుల్ బెడ్ రూమ్‌లలో మొదటి ప్రాధాన్యతగా మున్సిపల్ కార్మికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్య క్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఉద్యోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మ, ఉపాధ్యక్షుడు పెంటయ్య, ఈశ్వరమ్మ, నాయకులు సీపీఐ(ఎం) నాయకులు బాలపిర్ తదితరులు పాల్గొన్నారు.