Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
క్యాన్సర్ సంరక్షణ, నివారణలో రోగులకు ఉచితంగా సహాయం చేస్తూ, గిన్నిస్ వరల్డ్ రికార్డును అందుకున్న స్వచ్ఛంద సంస్థ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఎనిమిదేండ్లు పూర్తిచేసుకుంది. ఈసందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 37లోని దసపల్లా హోటల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రముఖులతో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుటుంబంలో తన తండ్రి పదేండ్లుగా, తల్లి ఆరేండ్లుగా క్యాన్సర్‌తో బాధ పడుతున్నారని, క్యాన్సర్ బారిన పడిన కుటుంబం ఆర్థికంగా నష్టపోతారన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, పేదవారు సరైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌ను రూ.120 కోట్లతో, 450 పడకలతో అన్ని వసతులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దేందకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో కిడ్నీ, గుండె, క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు 5 సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటుకు 'తానా' (యూఎస్ఏ) ముందుకు వచ్చిన సందర్భంగా, వారికి తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఇప్పటి వరకు 10 మిలియన్ల క్యాన్సర్ రోగులకు వైద్యం అందించడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి, డాక్టర్ ప్రమీలారాణి, వ్యవస్థాపక ట్రస్టీ క్యాన్సర్ ఫౌండేషన్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వసుధ ఫార్మా ఫౌండేషన్ నిర్వాహకులు ఎంవీ రామరాజు రూ. 20 లక్షల చెక్కును క్యాన్సర్ ఫౌండేషన్‌కు విరాళంగా అందించారు. అదేవిధంగా తన వంతు సహాయంగా మంత్రి హరీష్ రావు ఒక నెల వేతనాన్ని ఫౌండేషన్‌కు విరాళంగా ప్రకటించారు. అనంతరం అపోలో సీఈవో సుబ్రహ్మణ్యంను సన్మానించారు. కార్యక్రమంలో మూవర్స్ కామ్ సీఈఓ విద్యా గారపాటి, డాక్టర్ కిరణ్ ఆవంచ, సుజాతా రావు, సీనియర్ ఐఏఎస్ అధికారి అజరు మిశ్రా పాల్గొన్నారు.