Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
8 లక్షల మంది యూనివర్సిటీ- హాస్టల్, గురుకుల పాఠశాల కాలేజీ విద్యార్థుల మెస్ చార్జీలు, స్కాలర్ షిప్లు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లపెళ్లి అంజి అధ్యక్షతన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. ఈధర్నాలో ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ ఐదేండ్ల కిందట ఆనాటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ చార్జీలు, స్కాలర్ షిప్లు ఇప్పటికీ కొనసాగిస్తున్నారన్నారు. ఇటీవల నిత్యావసర ధరలు, నూనెలు, పప్పులు, కూరగాయలు అన్ని ఆహార వస్తువుల ధరలు రెండు, మూడు రెట్లు పెరగడంతో హాస్టల్ గురుకుల పాఠశాల విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. హాస్టల్ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. సంబంధిత మంత్రులు, ప్రిన్సిపాల్ సెక్రటరీలు, డైరెక్టర్లు ఒకనాడు కూడా హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల సాదక బాధకాలు తెలుసుకోవడం లేదన్నారు. పోరాడకపోతే హాస్టళ్ల పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదన్నారు. బీసీ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు, బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్ను రూ.200 కోట్లకు పెంచాలన్నారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, గొరిగ మల్లేష్ యాదవ్, దాసు సురేష్, పగిళ్ళ సతీష్, కూనూరు నర్సింహ గౌడ్, కృష్ణ యాదవ్, చంటి, అనంతయ్య, బీసీ వెంకట్, చరణ్ యాదవ్, రఘు పాల్గొన్నారు.