Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీనగర్లో మద్యం షాపు తరలింపునకు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి హామీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
చర్లపల్లి డివిజన్లోని గాంధీనగర్లో మద్యం షాపు వద్దంటూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా), భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ), ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కాలనీ వాసులు అయిదు రోజులుగా చేస్తున్న ఆందోళనకు కార్పొరేటర్ బొంతు శ్రీదేవీ స్పందించారు. ఆ షాపును అక్కడి నుంచి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ తన హామీని నేరవేర్చకపోతే మరోసారి పోరాటానికి సిద్ధమవుతామని ఐద్వా, ఎస్ఎఫ్ఐ హెచ్చరించింది. ఈ సందర్భంగా ఐద్వా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి మాట్లాడుతూ తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా మారుస్తున్న టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలో 2600 పైగా మద్యం షాపులకు లైసెన్సులు ఇచ్చిందని, విద్యకోసం పాటుపడండి అని అధికారమిస్తే.. తాగుడికి వ్యసనాలుగా మారండి అనేవిధంగా వ్యవహరించడం సరైనది కాదన్నారు. యువకులను, మగవారిని తాగుడికి బానిసలు చేయడం వల్ల అనేక అనర్థాలకు కారణమవుతుందని స్పందించకుండా, నిరంకుశ ధోరణిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై వారు మండిపడ్డారు. ఐక్యంగా ఉండి పోరాడిన కాలనీవాసులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి పడాల శంకర్ మాట్లాడుతూ ప్రజా పోరాటాలకు ఎవరైనా తల వంచాల్సిందే అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అ విషయం స్పష్టంగా అర్థమైందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మానుకోవాలని తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు సాయి, ప్రజానాట్యమండలి నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు.