Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నూతన వైన్స్ షాప్స్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా తార్నాక-మౌలాలి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న శ్రీలక్ష్మీ గణపతి ఆలయానికి ఎదుట నూతనంగా 'శ్రీకొండ పోచమ్మ వైన్స్' ఏర్పాటు చేశారు. దీనిపై ఆలయ నిర్వాహకులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ఎదుట మద్యం దుకాణం ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధం అని చెబుతున్నారు. అధికారులు కనీసం వైన్‌షాప్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, నిబంధ నలు పాటిస్తున్నారా? లేదా కనీసం పరిశీలించారా? అంటూ ఆలయ కమిటీ, ఇటు పూజారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆలయ కమిటీ సభ్యులు, మెహతబు ఆర్కేడ్ ఫ్లాట్స్, షాప్ ఓనర్స్ అసోసియేషన్ వారు జిల్లా కలెక్టర్, సంబంధిత ఎస్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన వైన్ షాప్‌ను తొలగించకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇటు ఆలయ నిర్వాహకులు, ఇటు అపార్ట్మెంట్ వాసులు, షాప్స్ యజమానులు ఇక్కడ వైన్ షాప్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భంలో మరి ఎస్సైజ్ అధికారులు ఎంత వరకు స్పందిస్తారో? ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!
నిబంధనల ప్రకారమే అనుమతి : ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్
గణపతి ఆలయం ఎండోన్మెంట్ పరిధిలో లేదు. ఆలయం, వైన్ షాప్‌నకు మధ్య 120 మీటర్స్కుపైగా దూరం ఉంది. నిబంధనల ప్రకారమే మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చాం.
న్యాయ పోరాటం చేస్తాం : ఆలయ ప్రధాన కార్యదర్శి పి.సుబ్బారావు
ఆలయం ఎదుట వైన్ షాప్ ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధం. దీనిపై జిల్లా కలెక్టర్, సంబంధిత ఎస్సైజ్ కమిషనర్, సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశాం. తొలగించే వరకు న్యాయపోరాటం చేస్తాం.