Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణలో తొలిసారిగా 'ప్రజల వద్దకు న్యాయం-ప్రజలందరికీ న్యాయం' అనే నినాదంతో జస్టిస్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని డిజైన్ చేసిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అభినందనీయులు అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. మంగళవారం సుల్తాన్ న్యాయ కళాశాలలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ గీతారావు ఆధ్వర్యంలో 'మైనార్టీ హక్కులు మానవ హక్కులే' అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య హాజరై మాట్లాడారు. అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నేడు ఐదవ సదస్సు విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయమని, భవిష్యత్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. గౌరవ అతిథిగా పాల్గొన్న డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ఉస్మానియా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగమని, ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, క్రైస్తవ మతాలన్నిటిని సమానంగా గుర్తించిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 25 నుంచి 30 వరకు మైనార్టీలకు ప్రత్యేకమైన రక్షణ కల్పించిందని, అందుకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు మైనార్టీలు రుణపడి ఉండాలని ఆయన అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జస్టిస్ చంద్రయ్య చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి విద్యాధర్ బట్, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా డాక్టర్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.