Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రవాణాశాఖకు మరోసారి కాసుల పంట పండింది. మంగళవారం హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటలో రవాణాశాఖకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. వేలం నిర్వహించిన మూడు 3 ఫ్యాన్సీ నెంబర్లకు సుమారు రూ.46.14 లక్షలకు పైగా ఆదాయం వచ్చిందని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్(జేటీసీ) జె.పాండురంగ నాయక్ తెలిపారు. స్టేటస్ సింబల్, క్రేజీ కోసం కొందరు.. న్యూమరాలజీ కోసం మరికొందరు ఫ్యాన్సీ నంబర్లను తీసుకుంటుండటంతో, నచ్చిన నంబర్ కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వాహనదారులు వెనుకాడటం లేదు. 9999 నంబర్ ఈసారి బిడ్డింగ్‌లో రికార్డు స్థాయిలో రూ.20.10 లక్షలు పలికింది. ఒకే రోజు ప్రత్యేక నంబర్లపై ఆర్టీఏకు రూ.40.14 లక్షలకుపైగా ఆదాయం సమకూరిందని జేటీసీ చెప్పారు. రవాణాశాఖలో ఇది అరుదైన రికార్డు అని తెలిపారు. కాగా, వాహనదారులకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా రవాణాశాఖ ఫ్యాన్సీ నంబర్లను ఆన్లైన్ విధానంలో కేటాయిస్తోందని చెప్పారు.
ఇదిలావుంటే, మంగళవారం నిర్వహించిన ఆన్లైన్ ఈ-వేలంలో కిస్టోన్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీ సంస్థ తమ ఖరీదైన వాహనం కోసం రూ.20.10 లక్షలు వెచ్చించి ఈ-వేలంలో టీస్-09 ఎఫ్టీ 9999 నంబర్‌ను దక్కించుకుంది. అదే విధంగా టీఎస్09 ఎఫ్యూ 0009 నంబర్‌ను ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీ సంస్థ తమ విలువైన కారు కోసం రూ.7.95 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. కాగా టీఎస్09 ఎఫ్యూ 0001 నంబర్‌ను రాధికారెడ్డి పెరాటి రూ.3.08 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. రవాణాశాఖ జులై నెలలో నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల ఈ వేలంలో ఆల్ నైన్స్ను జూనియర్ ఎన్టీఆర్ రూ.17లక్షలకు దక్కించుకున్న విషయం తెలిసిందే.