Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ముషీరాబాద్ పరిధిలోని రిసాలగడ్డ వాటర్‌ట్యాంక్ సంఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాటర్‌బోర్డు సరఫరా చేస్తున్న నీటిపై భయాందోళన నెలకొంది. ట్యాంక్‌ల నిర్వహణలో లోపాలు బయటపడుతుండటంతో సిటీ ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. రిజర్వాయర్లవద్ద ప్రయివేటు సెక్యూరిటీ గార్డులతోపాటు జలమండలి సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అదనంగా 600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
రిజర్వాయర్ల వద్ద 24 గంటల భద్రత
సిటీలోని రిజర్వాయర్లు, వాటర్ట్యాంకులవద్ద మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని జలమండలి ఎండీ నిర్ణయించారు. 378 సర్వీస్ రిజర్వాయర్లుండగా, దాదాపు 100 రిజర్వాయర్ల ప్రాంగణాల్లోనే కార్యాలయాలు ఉండటంతో అక్కడ 24 గంటల భద్రత ఉంది. మిగతా 278 రిజర్వాయర్లవద్ద పాక్షికంగా భద్రత ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో 24 గంటల భద్రత కల్పించేందుకు నిర్ణయించారు.
ఆ ప్రాంగణం నిషేధం
సిటీలోని రిజర్వాయర్ల ప్రాంగణాలకు, వాటర్ ట్యాంకుల వద్దకు ఇతరులు రాకుండా చర్యలు తీసుకోనున్నారు. ఎలివేటెడ్ రిజర్వాయర్లవద్ద పైకి వెళ్లే మెట్ల దగ్గర గేట్లు అమర్చి తాళం ఏర్పాటు చేయనున్నారు. అన్ని రిజర్వాయర్ల ప్రాంగణాల బయట ఇతరులకు అనుమతిని నిషేధించారు. 'నిషేధితస్థలం' అనే సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. రిజర్వాయర్లలోకి దిగడానికి ఏర్పాటుచేసిన మూతలు, గేట్లకు తప్పనిసరిగా తాళాలు వేయాలని అధికారులు నిర్ణయించారు.
వందమంది ప్రయివేటు సెక్యూరిటీ
రిజర్వాయర్లవద్ద 24 గంటల భద్రత కోసం మరో వందమంది ప్రయివేటు సెక్యూరిటీ గార్డులను నియమించేందుకు రంగం సిధ్దమైంది. ఇందుకోసం ఇప్పటికే ఎజైల్ సంస్థకు టెండర్ ఖరారు చేశారు. అంతేగాక జలమండలిలోని వివిధ విభాగాల్లో సుమారు 200 మంది అదనపు సిబ్బందిని గుర్తించారు. వారికి కూడా 15 రోజుల్లో రిజర్వాయర్ల ప్రాంగణాల్లో భద్రత, పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నారు. రిజర్వాయర్ల తనిఖీకి నాలుగు ఫ్లయింగ్ స్వ్కాడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ రవిచంద్రన్‌రెడ్డి పర్యవేక్షిస్తారు. రాత్రి సమయాల్లో కూడా రిజర్వాయర్ ప్రాంగణాల్లో రక్షణ చర్యలను తనిఖీ చేయనున్నారు.
600 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
నెల రోజుల్లో అన్ని రిజర్వాయర్ల ప్రాంగణాల్లో 600కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేసే విషయంపై పోలీసు శాఖతో సంప్రదిస్తున్నారు.
3 రోజుల పాటు సెక్యూరిటీ ఆడిట్
రానున్న 3 రోజులపాటు సీజీఎంలు, జీఎంలు, విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో 21 బృందాలుగా ఏర్పడి అన్ని రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకుల వద్ద సెక్యూరిటీ ఆడిట్ చేయనున్నారు. రిజర్వాయర్ల ప్రాంగణాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై సమగ్ర నివేదిక అందింస్తారు. నివేదికలను పరిశీలించిన అనంతరం అవసరమైన మరిన్ని భద్రతా చర్యలు అధికారులు తీసుకోనున్నారు.