Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహిం చారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.మహేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.4,200 కోట్లు విద్యార్థులకు చెల్లించాల్సి ఉందనీ, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల కోసం, మందిరాలు, కార్ కాన్వారులకు రూ.కోట్లు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయంగా, హక్కుగా వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను విడుదల చేయడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శించడం సిగ్గు చేటన్నారు. 1200 మంది విద్యార్థుల బలిదానాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయింపులో భాగంగానే విద్యార్థులకు స్కాలర్షిప్ అందడం లేదన్నారు. భవిష్యత్‌లోనైనా విద్యారంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగానికి కేటాయించిన నిధులు కూడా కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించలేదన్నారు. ప్రభుత్వం ఇకనైనా మేలుకోవాలనీ, లక్షలాదిమంది విద్యార్థులకు బాకీ పడ్డ స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలన్నారు. స్కాలర్షిప్ సకాలంలో అందక లక్షలాది విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపేసే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే స్కాలర్ షిప్‌ను అందించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అనిల్, విష్ణు రాకేష్, సాయి కృష్ణ, సాయి కుమార్, అనిల్ శివాజీ, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.