Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
బొగ్గు గనుల ప్రయివేటీకరణ ప్రమాదకరమైన చర్య అని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ అన్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణగూడ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంధన భద్రతను నిర్వీర్యం చేస్తూ బొగ్గు గనుల రంగాన్ని ప్రయివేటీకరించడం దేశ వ్యతిరేకమన్నారు. నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజా ప్రయోజనాల కోసం ఉన్న విలువైన జాతీయ ఆస్తులను అమ్ముకోవడం దేశద్రోహం కదా అని ప్రధాని మోడీని ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తి, ఉక్కు, అల్యూమినియం, ఎరువులు, సిమెంట్ వంటి అనేక ముఖ్యమైన పరిశ్రమలన్నీ బొగ్గు ఆధారిత పరిశ్రమలని, వీటిపై బొగ్గు ప్రయివేటీకరణ తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రయివేటీకరణ ఒక భావోద్వేగ సమస్య అని, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ ఎత్తుగడపై తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సొంతంగా అభివృద్ధి చేసుకున్న బొగ్గు గనులను, అత్యంత లాభదాయకంగా ఉన్న సింగరేణి బొగ్గు గనుల ప్రయివేటీకరణపై పోరాటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకొచ్చి నాయకత్వం వహించాలని కోరారు. ప్రయివేటీకరణ పేరుతో సింగరేణి కార్మికుల ప్రయోజనాలను కాలరాస్తే ఉరుకునేదిలేదని, బొగ్గు గనుల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే వరకు నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుల పోరాటాల్లో ఏఐటీయూసీ ప్రత్యేక్షంగా పాల్గొంటూ వారికి మద్దతు తెలుపుతుందని వెల్లడించారు. అనంతరం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ సత్తుపల్లి ఓసీపీ-3, కొత్తగూడెం ఓసీపీ-3, శ్రావణపల్లి గని, కేకే-6 గనులను బడా పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్ని టెండర్లను పిలుస్తుందని ఆరోపించారు. బొగ్గు రంగాన్ని ప్రయివేటీకరించడం వల్ల దేశవ్యాప్తంగా బొగ్గు రంగంలో పని చేస్తున్న లక్షలాది మంది కార్మికులు వారి జీవనోపాధి కోల్పోతారన్నారు. సింగరేణి బొగ్గు గనులు ప్రయివేట్ పరం కాకుండా అడ్డుకుంటామని, కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికి తీవ్రమైన ఉద్యమాలు, పోరాటాలు చేపడుతామని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.ప్రేంపావని, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి కె.రాజ్ కుమార్, యూనియన్ కో-ఆర్డినేటర్ ఏ.వేణుమాధవ్, ఏఐటీయూసీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కమతం యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఏం.నరసింహ, కోశాధికారి బొడ్డుపల్లి కిషన్, నగర నేతలు ఆర్.మల్లేష్, ఎస్.కె.లతీఫ్, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.