Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
అభివృద్ధిలోనే కాదు, కొత్త కొత్త ఆవిష్కరణలూ.. రూపకల్పల్లో ఆయనకాయనే సాటి. కష్టకాలంలో మొట్టమొదటి ఐసోలేషన్ సెంటర్ ఏర్పర్చి, రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకూ దిక్సూచిగా మారిన సందర్భం, సమయాన్ని ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. ఎంతోమంది పేదలకు అన్నివిధాలా తోడ్పాటునందించి ఆపద్బాంధవుడిగా నిలిచిన ఆయన నేడు నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకు ముందుకొచ్చారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా.. యువతీ యువకుల భవిష్యత్ దృష్ట్యా ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని వారికి అందుబాటులో ఉంచారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవసరమైన సదుపాయాలు కల్పించి, ప్రత్యేక నిధులు కేటాయించారు. నిరుద్యోగులకు చక్కని వేదిక ఏర్పర్చి 'ఉపాధి' భవితకు ఊతంగా నిలుస్తున్నందుకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. శుక్రవారం ఈ కేంద్రాన్ని మేయర్ వెంకట్‌రెడ్డి, కమిషనర్ రామకృష్ణ రావు, కో ఆర్డినేటర్ పి.వనజ సందర్శించి మరిన్ని వసతులు కల్పించే దిశగా చర్యలు చేపట్టారు.
అసలే కరోనా లాక్డౌన్ కాలంలో ఉపాధి మార్గాలు సన్నగిల్లి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న నిరుపేదలకు భరోసా నిలిచేందుకు పీర్జాదిగూడ కార్పొరేషన్ పాలకవర్గం నిర్ణయించింది. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక శిక్షణ కల్పించాలనే ఉద్దేశంతో గత నాలుగు నెలల క్రితం 'సెట్విన్' సెంటర్‌ను కార్పొరేషన్ భవనంలో ఏర్పాటు చేశారు. అందులో సౌకర్యాలకు, శిక్షణ కోసం వచ్చేవారికి ఉపయోగపడే విధంగా అన్ని పరికరాలు ఉంచారు. మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి కృషితో దాని అభివృద్ధికోసం కార్పొరేషన్ నిధులు రూ.50 లక్షలు కేటాయించారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో 300 మందికి 26 రకాల కోర్సులు అందిస్తున్నారు. బయట ఇనిస్టిట్యూట్లతో పోలిస్తే అతి తక్కువ ఫీజుతోనే టెక్నికల్, కంప్యూటరైజ్డ్ కోర్సులు ఇక్కడున్నాయి. పదో తరగతి పాసైనా, ఫెయిలైనా వారికి అవకాశం కల్పిస్తున్నారు. కొన్ని కోర్సులకు కనీస అర్హత ఇంటర్, డిగ్రీ పెట్టారు. మహిళలు, గృహిణుల కోసం బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, స్పా సెలూన్ మేనేజ్మెంట్, అడ్వాన్స్ బ్యూటీషియన్ వంటి స్పెషల్ కోర్సులు కూడా అతి తక్కువ ఫీజులతో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. కంప్యూటర్ యుగంలో డిజిటల్ రంగానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో వెబ్ డిజైనింగ్, మల్టీమీడియా, సీసీ టీవీ ఇన్స్టాలేషన్ వంటి కోర్సులను నేర్చుకునేందుకు అద్భుత అవకాశం ఇక్కడుంది. టైక్స్‌టైల్ డిజైనింగ్, మగ్గం వర్క్స్, జ్యూట్, పేపర్, క్లాత్ బ్యాగుల తయారీకి కూడా మహిళలు నేర్చుకునే వెసులుబాటు కలదు. పీర్జాదిగూడ వాసులకు, వికలాంగులకు 50 శాతం ఫీజు రాయితీ కూడా ఉంది.